Adilabad : ఆదిలాబాద్‌లో జలపాతాలు పరవళ్లు.. వివరాలు ఇవిగో..!
ఉత్తర తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, లింగపూర్, పెంచికల్ పెట్, వాంకిడి, సిర్పూర్ మండలాల్లోని జలపాతాలు జలకళలను సంతరించుకున్నాయి.
జలపాతాలు ప్రకృతి రమణీయతతో మెరిసిపోతున్నాయి. నీళ్ల సవ్వడితో పరవళ్లు తొక్కుతూ సవ్వడి చేస్తున్నాయి. ఈ జలపాతాలను చూడటానికి సందర్శకులు హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి సైతం వందలాదిమంది విచ్చేస్తున్నారు. జిల్లాలో అడవిశాతం ఎక్కువగా ఉండటం వల్ల జలపాతాలకు వెళ్లే దారులు సైతం వయ్యారంగా ముస్తాబై ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.
లింగాపూర్ మండలానికి వెళ్లాలంటే కెరమెరి మీదుగా వెళ్లాలి.. ఈ దారిలో సుమారు 7 కిలోమీటర్ల మేరకు అడవి విస్తరించి ఉంటుంది. వెళ్లేటప్పుడు ప్రకృతి అందాలను, సందడి చేస్తున్న జలపాతాల అందాలను చూడాలంటే రెండు కళ్లు సరిపోవని పర్యాటక ప్రేమికులు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com