Siricilla : ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి తాళలేక సిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్య

నన్ను క్షమించండి.. అంటూ ఓ నేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓవైపు ఉపాధి కరవై.. మరోవైపు నెల నెలా కట్టాల్సిన ఈఎంఐల కోసం వేధింపులు తీవ్రం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. నేతన్న రాసిన సూసైడ్ నోట కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కంటతడి పెట్టించింది. ఉపాధి లేక, బజాజ్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్య నిర్ణయం తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో నేత కార్మికుడు పేర్కొన్నాడు. ఇద్దరు ఆడబిడ్డలను, భార్యను అనాథలుగా మిగిల్చి నేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన దూస గణేష్ (50) అనేక సంవత్సరాలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉపాధి పొందుతున్నాడు. గత కొంతకాలంగా వస్త్ర పరిశ్రమలో సంక్షోభం మూలంగా ఉపాధి లేకపోవడంతో గణేష్ ను పరిస్థితులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిస్థితిలో తీవ్ర మనస్తాపం చెందిన గణేష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి ఉపాధి లేని పరిస్థితి, ఫైనాన్స్ సంస్థల ఒత్తిళ్లే కారణమని లెటర్ లో తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com