Bandi Sanjay : తప్పనిసరి పరిస్థితుల్లో సెక్రటేరియట్‌కు వెళ్లా : బండి సంజయ్

సీఎం రేవంత్ రెడ్డితో అన్ని విషయాలూ చర్చించామని, వరద నష్టాన్ని అంచనా వేసి సాయం ప్రకటించడం జరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లానని స్పష్టం చేశారు. హోటల్ హరిత ప్లాజాలో కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఇది రాజకీయాలతో కూడిన సమస్య కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని అన్నారు. అన్ని అంశాలు కేంద్రం దృష్టిలో ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందిందని చెప్పారు. నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం తెలంగాణ, ఏపీకి కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఎస్డీఆర్‌ఎఫ్ నిధులు రూ.1,345 కోట్లు ఉన్నాయని, గత ప్రభుత్వం ఈ నిధులను వాడుకోలేకపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారని గుర్తు చేశారు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పుడూ గత ప్రభుత్వం కేంద్రమంత్రుల్ని పిలవలేదు.. కలవలేదని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com