కోవిడ్ రూల్స్ బ్రేక్.. నాలుగు పబ్‌లపై కేసులు నమోదు

కోవిడ్ నిబంధనలు సడలింపులో భాగంగా ప్రభుత్వం పబ్‌లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ నేపత్యంలో నో మాస్క్ నో ఎంట్రీని పబ్‌లు కచ్చితంగా పాటించాల్సి ఉంది. అలాగే పబ్ లోపల సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా పబ్‌లకు సంబంధించిన సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు ధరించడంతో పాటు కస్టమర్లకు ఆర్డర్లను సరఫరా చేసే సమయంలో.. వెయిటర్స్ మాస్క్‌లను ధరించాలన్న నిబంధనలను తీసుకువచ్చారు. అలాగే డ్యాన్స్ ఫ్లోర్‌ను మూసివేయాలని.. ఈ నిబంధనలను పాటిస్తూ పబ్‌లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు నాలుగు నెలల తరువాత పబ్‌లకు అనుమతి ఇవ్వడంతో నిర్వాహకులు ఆగమేఘాల మీద పబ్‌లను ఓపెన్ చేశారు. ముందు కొన్ని రోజులు కోవిడ్ నిబంధనలను సీరియస్‌గానే ఫాలో అయ్యారు. అందులోనూ కస్టమర్లు పెద్దగా పబ్‌లకు రావడం తగ్గించారు. ఆ సమయంలో పబ్‌లలో కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ రోజు రోజుకూ కస్టమర్ల తాకిడి పెరుగుతుండటంతో కోవిడ్ నిబంధనలను గాలికొదిలేశారు పబ్‌ల నిర్వాహకులు. నో మాస్క్ నో ఎంట్రీని నామమాత్రంగా అమలు చేస్తున్నారు. అంతే కాదు.. పబ్‌లలో అసలు సోషల్ డిస్టెన్స్ అనేది కనపించకుండాపోయింది.
పలు పబ్‌లపై నిఘా పెట్టిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా, తబలారసా, కెమిస్ట్రీ, ఎయిర్ లైవ్ పబ్‌లపై దాడులు చేశారు. ఎక్కడా కోవిడ్ నిబంధనలను పాటించకపోవడమే కాక.. డ్యాన్స్ ఫ్లోర్‌లో విచ్చలవిడిగా మద్యం మత్తులో చిందులేస్తున్న వారిని చూసి అవాక్కయ్యారు. దీంతో తబలారసా, కెమిస్ట్రీ, అమ్నేషియా, ఎయిర్ లైవ్ పబ్‌లపై కేసులు నమోదు చేశారు.
కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని.. లేదంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దాడుల్లో నిబంధనలను పాటించడం లేదన్న విషయం తేలితే పబ్‌లను సీజ్ చేస్తామని నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com