Revanth Reddy : స్థానిక ఎన్నికలపై రేవంత్ తేల్చేస్తారా..?

Revanth Reddy : స్థానిక ఎన్నికలపై రేవంత్ తేల్చేస్తారా..?
X

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు స్పష్టత ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఇంతకాలం బీసీ రిజర్వేషన్ల అంశమే ఈ ఎన్నికల వాయిదాకు ప్రధాన కారణమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి భావించినా, చట్టపరమైన పరిమితులు అడ్డంకిగా మారాయి. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇక రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి ఫలితాల్లో కాంగ్రెస్ గెలిస్తే, రేవంత్ రెడ్డి వచ్చే నెలలోనే లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు? రిజర్వేషన్లపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు? అనే అంశాలపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి నిలిచింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం పిటిషన్ కొట్టేసింది ధర్మాసనం.

కాబట్టి హైకోర్టు తీర్పుపైనే ఆశలు ఉన్నాయి. హైకోర్టులో అనుకూలమైన తీర్పు వస్తుందనే నమ్మకం లేదు. కాబట్టి పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు పెట్టేయాలని చూస్తోంది. జూబ్లీహిల్స్ లో గెలిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఊపుతో స్థానిక ఎన్నికలకు వెళ్లినా సరే పెద్దగా ఎఫెక్ట్ పడదు. స్థానికంలో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేసి వారి ఓట్లను పొందవచ్చు. ఎటు చూసినా పెద్దగా కాంగ్రెస్ కు నష్టం ఉండదు కాబట్టి వచ్చే నెలలోనే ఎన్నికలు పెట్టే ఛాన్స్ ఉంది.

Tags

Next Story