TG : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా?

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై నాలుగు వారాల్లో అనర్హత వేటు వేయాలని, లేదంటే తామే సుమోటోగా తీసుకొని ఆయా ఎమ్మెల్యేలపై వేటు వేస్తామని అసెంబ్లీ స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్ట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టగా.. అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టులకు లేదని ఏజీ వాదించారు. కాగా ఈ కేసుపై న్యాయమూర్తి విచారణను నేటికి వాయిదా వేశారు. బుధవారం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయుంపుపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలలో తీర్పు అనుకూలంగా వస్తుందా..? ప్రతికూలంగా వస్తుందా అని టెన్షన్ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com