Loan Waiver : పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తారా? : కొప్పుల ఈశ్వర్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఏం బాగు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ మొఖం పెట్టుకొని కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు? అని ప్రశ్నిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అసలు అధికారంలో ఉండి ఏ ఘనకార్యం చేశారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారో చెప్పాలన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి ఒక్కటైనా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ అని గొప్పులు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు సిగ్గుండాలన్నారు. ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్థాయిలో అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఏ గ్రామానికైనా వచ్చి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తారా? అని నిలదీశారు. రైతులను కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు, 17 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని హితవుపలికారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com