Wipro Expands : హైదరాబాద్ లో క్యాంపస్ ను విస్తరించనున్న విప్రో

హైదరాబాద్‌లో విప్రో కంపెనీ తమ క్యాంపస్‌ను మరింత విస్తరించనుంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సమావేశమయ్యారు. అనంతరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ తెలుపుతోంది. ఈ కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేళ్లలో పూర్తవనుంది. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుంది. విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com