Yadadri: వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా యాదాద్రి పునఃసృష్టి..

Yadadri: వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా యాదాద్రి పునఃసృష్టి..
Yadadri: పంచనారసింహ క్షేత్రానికి ఆరు రాజగోపురాలతో పునఃసృష్టి చేసిన నవ వైకుంఠమే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం.

Yadadri: పంచనారసింహ క్షేత్రానికి ఆరు రాజగోపురాలతో పునఃసృష్టి చేసిన నవ వైకుంఠమే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం. వెయ్యేళ్లపాలు చెక్కుచెదరకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కృష్ణశిలలతో, అత్యద్భుత శిల్పకళతో రూపొందిన దివ్యధామం. దేశంలో పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మించిన ఒకే ఒక్క భవ్యాలయం. రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలతో, ఇద్దరు స్థపతులు, 12 మంది ఉపస్థపతులు, 800 మంది శిల్పులు, 1500 మంది కార్మికులు, 66 నెలల పాటు శ్రమించి రూపుదిద్దిన మహాక్షేత్రం.

యాదాద్రి పంచనార సింహుల క్షేత్రం అయినప్పటికీ.. గుహాలయంలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకునేలా, తరతరాలూ నిలిచిపోయేలా రూపుదిద్దుకుంది. నవ వైకుంఠాన్ని.. కాకతీయ, పల్లవ రాజుల కాలం నాటి శైలిలో నిర్మించారు. ఆ రాజులు నిర్మించిన ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయినా.. వారి శిల్పకళా వైభవం యాదాద్రిలో కనిపించేలా పునఃసృష్టి చేశారు.

ఆధార శిల మొదలుకుని గోపురాల దాకా రాతి స్తంభాలు, మండపాలు, శిల్పాలు ఇలా.. ప్రతి నిర్మాణం ఆనాటి శిల్ప శాస్ర్తాన్ని చూపిస్తుంది. కనుమరుగైన చరిత్రను వెయ్యేళ్ల పాటు చాటిచెబుతుంది. దేవాలయ అవసరాలతోపాటు భక్తుల వసతికి సంబంధించిన పలు సముదాయాలను ఇవాళే ప్రారంభిస్తారు. ఇప్పటికే గండి చెరువుకు గోదావరి జలాలు వచ్చాయి. కొండపైన విష్ణు పుష్కరిణి, కొండ కింద లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట సిద్ధంగా ఉన్నాయి.

దీక్షాపరుల మండపంలో భక్తులకు అన్నదానం ప్రారంభించనున్నారు. నిర్మాణం పూర్తయిన మూడో ఘాట్‌ రోడ్డును సైతం ప్రారంభిస్తారు. యాదాద్రీశుడిని దర్శించుకునే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు మొదటగా క్యూ కాంప్లెక్స్‌లో ఆన్‌లైన్‌ టికెట్‌ తీసుకోవాలి. క్యూకాంప్లెక్స్‌లో దాదాపు 8వేల మందికి పైగా వేచి ఉండే సామర్థ్యం ఉంది. వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంప్‌, ఎస్కలేటర్‌ సౌకర్యాలు కల్పించారు.

ఆగ్రహం, అనుగ్రహం ఒకే సమయంలో ప్రకటించగల మూర్తి.. నరసింహస్వామి. ఆ అవతారమే యాదాద్రి నారసింహుడు. ఉగ్ర నరసింహుడుగా అవతరించి, పరమ శాంతమూర్తిగా మారిన దివ్య అవతారమూర్తి. రణం కోరిన వారికి ఉగ్రునిగా, శరణు వేడిన భక్తులకు లక్ష్మీ నరసింహుడుగా కరుణించే స్వరూపమది. శివుడు, విష్ణువు అంశల కలయికగా వెలిసిన అవతారమది. స్థితి కారుడైన విష్ణువు నర రూపం, లయకారుడైన శివుడు సింహ స్వరూపం కలగలిపి నరసింహస్వామిగా ఆవిర్భవించారు.

భక్తుడి మాటను నిలబెట్టడం కోసం నరసింహ రూపంలో స్తంభం నుంచి ఉద్భవించాడు నారాయణుడు. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు, తరిగొండ వెంగమాంబ సహా ఎందరో నరసింహ ఉపాసనతోనే కైవల్యం పొందారు. అన్నమయ్య తన సంకీర్తనల్లో వెంకటేశ్వరస్వామి తరువాత నరసింహుడినే స్తుతించారు. స్మరణ మాత్రంతోనే నరసింహుడు భక్తులను ఆదుకుంటాడని సాక్షాత్తు ఆదిశంకరాచార్యులే చెప్పారు.

ఆ నారసింహుని దివ్యాశీస్సులు పొందగలిగే అత్యద్భుత క్షేత్రమే యాదాద్రి. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. యాదాద్రి వైభవం చాటేలా హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు, మండప ప్రాకారాలు, మాడ వీధులు.. ఇలా అన్నింటినీ పూలతో అలంకరించారు. గుట్టకు చుట్టూ నాలుగు మార్గాల్లో పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు.

రాయగిరి వైపు నుంచి వచ్చే వాహనాలను వడాయిగూడెం సన్నిధి హోటల్‌ సమీపంలో, వంగపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను జూనియర్‌ కళాశాల సమీపంలోని వెంచర్‌లో, తుర్కపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను మల్లాపురం రింగ్‌రోడ్డు వద్ద, రాజాపేట నుంచి వాహనాలను సైదాపురం వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. కేవలం వీవీఐపీ, వీఐపీ వాహనాలను మాత్రమే కొండ కింద వరకు అనుమతిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story