Yadadri: యాదాద్రి పునః ప్రారంభోత్సవంలో ప్రధాన ఘట్టం..

Yadadri: యాదాద్రి పునః ప్రారంభోత్సవంలో ప్రధాన ఘట్టం..
Yadadri: లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం పునఃప్రారంభానికి సంబంధించిన యాగాలు, పూజాదికాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

Yadadri: యాదాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం పునఃప్రారంభానికి సంబంధించిన యాగాలు, పూజాదికాలు ముగింపు దశకు చేరుకున్నాయి. యాగాలు, పూర్ణాహుతి పర్వాలు, ఏకాశీతి కలశాలతో అభిషేకాలు, మూలమంత్రాలతో విశేష పూజలు, ధ్వజ కుంభారాధన, చతుర్వేద పారాయణం వంటి ఎన్నెన్నో కైంకర్యాలను రుత్వికులు, యాజ్ఞీకులు శాస్త్రోక్తంగా కొనసాగిస్తున్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులతోపాటు మిగతా వేదపండితులు ఈ వైదిక పర్వాలన్నింటినీ దగ్గరుండి జరిపిస్తున్నారు. సోమవారం ఉదయం బాలాలయంలో 9 గంటలకల్లా పూర్ణాహుతి పూర్తవుతుంది. అటు తర్వాత ప్రధాన ఆలయంలో ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మహా పర్వం మొదలు కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పూజల్లో కుటుంబ సమేతంగా పాల్గొంటారు.

అవి పూర్తయ్యాక ప్రధాన ఆలయంలో స్వయంభువు లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకునేందుకు సామాన్య భక్తుల్ని అనుమతిస్తారు. మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా ఏడో రోజు ఆదివారం పంచకుండాత్మక యాగాలు ఘనంగా జరిగాయి. ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, మూల మంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహించారు.

సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారయాణం, మూలమంత్ర హావనములు, చతు:స్థానార్చనలు, షోడశ కళాన్యాసహోమములు, పంచశయ్యధివాసం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించారు. సోమవారం జరిగే సంప్రోక్షణలు, యాగాల కోసం ప్రధాన ఆలయానికి సంబంధించిన సప్త రాజగోపురాలు, అష్టభుజిప్రాకార మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

ఆలయ విమానాలపై ప్రతిష్టించిన కలశాలపై మహాకుంభ సంప్రోక్షణ పూజలు నిర్వహించేందుకు కూడా అంతా సిద్ధం చేశారు. పైకి ఎక్కేందుకు ఏర్పాటు చేసిన కలప పరంజాపై ఎర్ర తివాచీ పరిచారు. ప్రధాన వీధుల్ని సైతం అందంగా అలంకరించారు. కొండపైన విష్ణు పుష్కరిణిని కూడా నీటితో నింపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నిర్వహించే ఉత్సవాల్లో దేవతామూర్తులకు జలాభిషేకం చేయడానికి ఈ నీటినే వాడతారు.

కొండపైన, కింద ఎక్కడిక్కకడ భారీ స్వాగత తోరణాల్ని ఏర్పాటు చేశారు. ఈ పునః ప్రారంభ ఘట్టం సందర్భంగా యాదాద్రి ఎటు చూసినా శోభాయమానంగా వెలిగిపోతోంది. యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణం కోసం దాదాపుగా 1280 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నభూతో అనే రీతిలో శిల్పకళాకృతుల్ని గోడలపైన, గోపురాలపైన తీర్చిదిద్దారు. దాదాపు 2 వేల 500 మంది శిల్పులు ఈ నిర్మాణ పనుల కోసం ఎంతో శ్రమించారు.

ఆలయ నిర్మాణ పనుల కోసం అవసరమైన కృష్ణ శిలల్ని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఎంతో వ్యవప్రయాసలకు ఓర్చి మరీ తెప్పించారు. మహాకుంభ సంప్రోక్షణ వైదిక పూజాదికాలు పూర్తైన తర్వాత ఆలయ పునర్‌నిర్మాణంలో పాలుపంచుకున్న అందరినీ సన్మానించనున్నారు కేసీఆర్. వీఐపీలు, భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో రెండు వేలమంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అన్నీ సమన్వయం చేసుకుంటున్నారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌లోని 14 విల్లాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు బస చేస్తారు. MLAలు, MLCలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం కూడా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story