Yadadri Brahmotsavam : యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. షెడ్యూల్ ఇదే

తెలంగాణ తిరుపతి యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి 11వ తేదీ వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్ష్మీ నృసింహుడి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏటేటా నిర్వహించినట్లు కాకుండా ఈసారి స్వర్ణ విమాన గోపురం కలిగి కొత్త అనుభూతితో ఉత్సవాలు నిర్వహించనున్నారు. స్వస్తివాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్టతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 7వ తేదీ స్వామి అమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం, 8వ తేదీ తిరు కల్యాణ మహోత్సవం, 9వ తేదీ దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 11న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 వరకు స్వామివారి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమాలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
ఆలయం లోపల, బయట కొండ చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు 3 వేల రూపాయలు చెల్లించి టికెట్ తీసుకొని సాంప్రదాయ దుస్తులతో భక్తులు పాల్గొనాలని దేవస్థాన అధికారులు సూచించారు. ఎండలు దంచికొడుతుండటంతో కొండ బండ నుంచి ఉపశమనం పొందేందుకు తిరు వీధుల్లో పూర్తిగా తెలుపు రంగు వేశారు. దేవదేవుడి బ్రహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు నిర్వహించనున్నారు. గరికపాట నరసింహారావు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, భక్తి సంగీతం, చిందు యక్షగానం, ధార్మిక ఉపన్యాసాలు, పౌరాణిక నాటక ప్రదర్శనలు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు సంగీత కార్యక్రమాలు ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com