TS: మనిషి కాదు... నరరూప రాక్షసుడు

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో దారుణం జరిగింది. ఓ ఆన్‌లైన్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న ఖానాపూర్ పట్టణ పరిధి అంబేడ్కర్‌నగర్ కాలనీకి చెందిన జూకింది శ్రీకాంత్, అదే కాలనీలో ఉంటున్న గంగారాం-గంగవ్వల చిన్నకుమార్తె చెటుపల్లి అలేఖ్య కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ వద్దంటూ అలేఖ్యను కుటుంబ సభ్యులు కుమార్తెను మందలించారు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు మూడు నెలల క్రితం నిర్ణయించారు. పెళ్లి విషయం తెలుసుకున్న శ్రీకాంత్, ఆమెను వివాహం చేసుకోబోతున్న యువకుడి కుటుంబ సభ్యులను కలిసి తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పాడు. పెళ్లి ఆగిపోయేలా చేశాడు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులు, పెద్దల సమక్షంలో యువకుడికి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతనిలో మార్పు రాకపోగా..యువతిపై పగ పెంచుకున్నాడు. అప్పట్నుంచి వేధిస్తూ వస్తున్నాడు. వదిన జయశ్రీతో కలిసి అలేఖ్య కుట్టు శిక్షణకు వెళ్లినట్టు తెలుసుకున్న శ్రీకాంత్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అంబేడ్కర్‌నగర్ కాలనీకి వెళ్లే చౌరస్తాలో కాపుకాశాడు. ఇంటికి వెళ్తున్న ఇరువురినీ అనుసరించాడు. జన సంచారం లేని ప్రాంతంలో వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. తప్పించుకుని పారిపోతుండగా వెంబడించాడు. తొలుత అలేఖ్యను దొరకబుచ్చుకుని మెడపై నరికాడు.
పక్కనే ఉన్న జయశ్రీ చంపొద్దంటూ కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కనికరం చూపకపోగా..ఆమె తలపై, కాళ్లపై కత్తితో నరుకుతూ పక్కకు నెట్టేశాడు. ఈ పెనుగులాటలో ఆమె రెండేళ్ల కుమారుడు రియాన్స్ తలకు కత్తి గాయాలయ్యాయి. అనంతరం అలేఖ్యను పలుమార్లు కత్తితో నరికాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన జయశ్రీ, ఆమె కుమారుడిని కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com