బీసీల పట్ల అంతులేని నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న జగన్ సర్కార్

YS Jagan Mohan Reddy ( File photo)
ప్రభుత్వం మారితే.. పథకాలను పక్కన పెట్టేయాల్సిందేనా? ఏ ప్రభుత్వం అయినా పేదలకు మంచి చేయడానికే. కేవలం కక్షగట్టి, పథకాలను రద్దు చేసి, పేదలకు దక్కాల్సిన ప్రయోజనాలను కాలరాస్తే దాన్నేం అంటారు. బీసీలకు ఎంతో చేస్తున్నాం అని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం కూడా నిర్దాక్షిణ్యంగా పేదలకు అందాల్సిన పథకాలను పక్కనపెట్టింది. బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్న ప్రభుత్వం.. ఆదరణ పథకం కింద బీసీలకు అందాల్సిన ఉపాధి పనిముట్లను వారికి దక్కకుండా చేసింది. ఇవి కేవలం ఆరోపణలు కావు.. ప్రత్యక్షంగా కనిపిస్తున్న సాక్ష్యాలు.
టీడీపీ హయాంలో బీసీల కోసం ఆదరణ పథకాన్ని తెచ్చారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ సైకిళ్లు కొనుగోలు చేశారు. పాల వ్యాపారం చేసుకునే వారి కోసం ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో భారీ ఎత్తున కొనుగోలు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పంపిణీ పూర్తి కాలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం.. ఆదరణ పథకం కింద రావాల్సిన సైకిళ్లు అందిస్తుందని బీసీలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కాని, ఏడాదిన్నర గడిచినా.. వాటి వైపే చూడలేదు ప్రభుత్వం. దీంతో తుప్పు పట్టిన సైకిళ్లు పనికిరాకుండా పోతున్నాయి.
కేవలం సైకిళ్లనే కాదు.. బీసీలకు అందాల్సిన ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర ఉపాధి పనిముట్ల విషయంలోనూ అంతులేని నిర్లక్ష్యం చూపింది జగన్ సర్కారు. ఇకనైనా తమ చేతికి ఉపాధి పనిముట్లు అందిస్తారన్న ఆశతో ఉన్న బీసీలు.. మూలనపడి ఉన్న వాటిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 353 ఆటోలు, 63 ట్రాక్టర్లు, 63 హైడ్రాలిక్ ట్రాలీలు, వందలాది సైకిళ్లు. కోట్లాది రూపాయలు వెచ్చించి వీటిని కొనుగోలు చేసింది టీడీపీ ప్రభుత్వం. జస్ట్.. లబ్దిదారులకు అందించడమే ఈ ప్రభుత్వం చేయాల్సిన పని. కాని, వీటిలో ఒక్క ఆటో గాని, ఒక్క ట్రాక్టర్‌గాని, కనీసం సైకిల్ కూడా బీసీలకు చేరలేదు. బీసీలకు జీవనోపాధిని కల్పించే ఈ యంత్రాలు, పనిముట్లు ఇలా నిరుపయోగంగా పడి ఉండడంతో ప్రజా సంఘాల నాయకులు సైతం ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com