YTP: షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం కానుందా..?

వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు.తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. ఇవాళ వైఎస్ జయంతి సందర్భంగా తండ్రి సమాధి వద్ద వైఎస్ షర్మిల, విజయమ్మ కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. షర్మిల తనపై ఉన్న ఆస్తులను కొడుకు, కూతురు పేరు మీదకు మార్చడం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రతి ఏటా అన్నాచెలెళ్లు కలిసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.అయితే ఈసారి మాత్రం వేర్వేరుగా నివాళులర్పిస్తారని తెలుస్తోంది.షర్మిల వెళ్లిన తర్వాత జగన్ మధ్యాహ్న సమయంలో ఘాట్ వద్ద నివాళులర్పిస్తారని అంటున్నారు. మరోవైపు వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా షర్మిల తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా స్థాపించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.ఇదే అంశంపై షర్మిల కీలక ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్‌కు విలీన సంకేతాలు పంపిన షర్మిల పలు డిమాండ్లు పార్టీ ముందు పెట్టినట్లు తెలుస్తోంది.వాటికి హస్తం పార్టీ హైకమాండ్ అంగీకరించిందా లేదా అన్నది తెలియరాలేదు.అయితే షర్మిల తెలంగాణ పాలిటిక్స్‌లో యాక్టివ్ ఉంటారా లేదా గతంలో మాదిరిగా ఏపీ రాజకీయాలకు షిప్ట్ అవుతారా? అదే జరిగితే తెలంగాణలో మరో రాజకీయ పార్టీ కనుమరుగు కానుందా? ఇడుపులపాయ వేదికగా ఇవాళ ఏం జరగబోతోంది? అన్నది సస్పెన్స్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com