REVANTH: తెలంగాణ సంస్కృతిని పరిరక్షిస్తాం

REVANTH: తెలంగాణ సంస్కృతిని పరిరక్షిస్తాం
X
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన... ప్రపంచ పటంలో తెలంగాణను ఉంచుతామని వ్యాఖ్య

తమ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తెలంగాణకు గర్వకారణమని రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పరిశీలించారు. సీఎం అక్కడ మొక్క నాటి హరిత స్ఫూర్తిని చాటారు. 2013లో కుతుబ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును అగాఖాన్‌ ఫౌండేషన్‌ చేపట్టింది. తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారని రేవంత్‌రెడ్డి చెప్పారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు. శతాబ్దాలుగా హైదరాబాద్ 'గంగా-జమునా తెహజీబ్'గా పిలువబడుతూ బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని చూసిందని పేర్కొన్నారు.

ఆగస్టులోపు రైతు రుణమాఫీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే రూ.6,093 కోట్లు మంజూరు చేశామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రూ.1.50 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను జులై 31కి ముందే మాఫీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు విదేశాల్లో పర్యటించనున్నానని.. తిరిగి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ కూడా చేసి రైతుల రుణం తీర్చుకుంటానని రేవంత్ తెలిపారు. రుణమాఫీ చేసి చూపించాలని బీఆర్ఎస్‌ నేతలు సవాల్ విసిరారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఆగస్టులోపే రుణమాఫీ చేస్తామని, జులై 31లోపే రూ.1.50 లక్షల్లోపు రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు ఆఖరుకల్లా రూ.2 లక్షల్లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు కష్టాలు వచ్చాయని బీఆర్ఎస్‌ నేతలు అంటున్నారని, పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదని, కేసీఆర్‌ కుటుంబానికి కష్టాలు వచ్చాయని సీఎం రేవంత్‌ ఎద్దేవా చేశారు. అధికారం పోయిందనే బాధ కేసీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు.

Tags

Next Story