దర్శకుడు ధవళ సత్యం..స్పెషల్ స్టోరీ..

దర్శకుడు ధవళ సత్యం..స్పెషల్ స్టోరీ..
పేరులో తెలుపు.. తీరులో ఎరుపు.. ఈ మాట దర్శకుడు ధవళ సత్యంకు ఖచ్చితంగా సరిపోతుంది.

పేరులో తెలుపు.. తీరులో ఎరుపు.. ఈ మాట దర్శకుడు ధవళ సత్యంకు ఖచ్చితంగా సరిపోతుంది. ఒళ్లంతా తెల్లటి దుస్తులు ధరించినా మనసంతా అభ్యుదయం నింపుకున్న అరుదైన దర్శకుడాయన. ప్రజానాట్యమండలి కళాకారుడిగా పరిషత్ నాటకాల్లో దాసరి సహనటుడుగా ఉండి ఆ తర్వాత అదే దాసరి శిష్యుడిగా పరిశ్రమలోకి వచ్చి అటుపై తను నమ్మిన సిద్దాంతాలనే కథావస్తువులుగా తీసుకుని వెండితెరపై ఎర్రమల్లెలు పూయించిన దర్శకుడు ధవళ సత్యం.

ఒకప్పుడు వెండితెరపై ఎర్రమల్లెలు పూయించిన అభ్యుదయ దర్శకుడు ధవళ సత్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. కాలేజ్ లో ఉండగానే నాటకాల పిచ్చి పట్టుకుంది. డిగ్రీలో దాసరి నారాయణరావు ఆయనకు సహధ్యాయి. అప్పటికే ప్రజానాట్యమండలి కళాకారుడుగా ఫేమ్ అయిన సత్యం దాసరితో కలిసి ఎన్నో నాటకాల్లో నటించారు. తర్వాత దాసరి సినిమా ఇండస్ట్రీకి వెళ్లారు. ఆ వెంటనే కాకపోయినా కొన్నాళ్లకు సత్యంకూ దాసరి నుంచి మద్రాస్ కు రావాలని పిలుపొచ్చింది.

జాతర.. ఇది దర్శకుడుగా ధవళ సత్యంకు తొలి సినిమా. చిరంజీవి ప్రధాన పాత్రధారి. అప్పటికి చిరంజీవికి ఏ ఇమేజ్ లేదు. ఈ సినిమాతో చాలామంది ఆర్టిస్టులను పరిచయం చేశారు. అప్పుడు పరిశ్రమలో నడుస్తోన్న ట్రెండ్ కు భిన్నంగా చాలా అడ్వాన్స్డ్ స్టోరీతో వచ్చిన సినిమా. 30రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని తర్వాత సెన్సార్ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆఖరుకు విడుదలైంది జాతర. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా సత్యంకు మంచి పేరొచ్చింది.

ఇండస్ట్రీని మొత్తం ఉలిక్కిపడేలా చేసిన సినిమా ఎర్రమల్లెలు. అప్పటి వరకూ సంప్రదాయ, మాస్ మసాలా సినిమాలు చేస్తోన్న దర్శకులు కూడా ఒక్కసారైనా ఎర్రమల్లెలు లాంటి సినిమా తీయాలని కంకణం కట్టుకునేలా చేసిన చేసిన సినిమా అది. యువతరం కదిలింది తర్వాత మళ్లీ మాదాల రంగారావు అందించిన కథతోనే చేసిన సినిమా ఇది. కార్మికవర్గ వ్యతిరేక, పెట్టుబడిదారీ వ్యాపార వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను ఏకకాలంలో దునుమాడుతూ సాగిన ఎర్రమల్లెలు సినిమాకు ఆ రోజుల్లో జనం బ్రహ్మరథం పట్టారు. ఊళ్ల నుంచి బళ్లుకట్టుకుని మరీ వెళ్లి చూసేవారు.

వంగవీటి రంగాకు అనుకూలంగా చైతన్యరథం తీశారనే కారణంగా కొన్నాళ్ల వరకూ ధవళ సత్యంతో సినిమా చేసేందుకు ఏ నిర్మాతా ముందుకు రాలేదు. ఇక తనే నిర్మాతగా మారాలనుకుంటోన్న టైమ్ లో తన గురువు దాసరి అండగా నిలిచారు. ఆయన నిర్మాతగా ఇంటింటి భాగవతం అనే సినిమాను సత్యంతో డైరెక్ట్ చేయించారు. అందులో దాసరి ఓ ప్రధాన పాత్రలో నటించారు. కానీ ఇది సత్యం పంథాకు భిన్నమైన సినిమా. అందుకే దాసరి వంటి పెద్ద తల అండగా నిలిచినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Tags

Read MoreRead Less
Next Story