ప్రభాస్ 'ఆదిపురుష్' సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్రభాస్ ఆదిపురుష్ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని సమాచారం.

రెబల్‌స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న 'ఆదిపురుష్'‌ మూవీ షూటింగ్‌లో భారీ‌ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో 'ఆదిపురుష్' కోసం భారీ సెట్ వేశారు. మంగళవారం సాయంత్రం అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెస్తోంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. కాగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని సమాచారం.

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. మంగళవారం ఉదయం షూటింగ్ మొదలైన సందర్బంగా ఆదిపురుష్ ఆరంభ్ అటూ ప్రభాస్ ట్వీట్ చేశారు.

అయితే అనూహ్యంగా సెట్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్స్ కోసం రూపొందించిన ఆ సెట్ పూరిగా మంటల్లో కాలిపోయింది. 8 ఫైరింజన్ల సాయంతో ఎట్టకేలకు మంటల్ని ఆర్పగలిగారు.

ముంబైలోని ఓ స్టూడియోలో షూటింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. గోరేగావ్ ప్రాంతంలోని స్టూడియోలో ఆదిపురుష్ కోసం వేసిన సెట్‌లో.. ఆ టైమ్‌లో డైరెక్టర్ ఓం రౌత్‌తోపాటు కొందరు నటీనటులు, చిత్ర యూనిట్ మాత్రమే ఉన్నారు. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపై ఆదిపురుష్ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు.

రామాయణం కథాంశంగా ఆదిపురుష్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుంటే రావణుడి పాత్ర సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. 5 భాషల్లో దీన్ని చిత్రీకరిస్తున్నారు. 300 కోట్ల రూపాయలు బడ్జెట్‌గా పెట్టుకున్నారు.

ఓ పక్క రాధేశ్యామ్‌లోను, మరో కొత్త ప్రాజెక్ట్ సలార్‌లోను నటిస్తున్న ప్రభాస్.. ఆదిపురుష్‌ను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇలాంటి పౌరాణిక చిత్రం కోసం వేసిన సెట్‌లో ప్రమాదం జరగడంతో ఆ ఎఫెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌పై పడే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఆదిపురుష్ మూవీని వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ అనుకున్నారు. ఈ ప్రమాదం ఎఫెక్ట్‌ ముందే ఫిక్స్ చేసుకున్న రిలీజ్‌పై పడుతుందా.. ఈ డ్యామేజ్ ఎంత పెద్దది అనే దానిపై మూవీ టీమ్ వివరాలు వెల్లడించాల్సి ఉంది. గ్రీన్‌స్క్రీన్‌ సెట్‌ మొత్తం కాలిపోవడం అంటే డ్యామేజ్ కోట్లల్లోనే ఉండొచ్చని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story