Maa elections 2021 : 'మా'ఎన్నికలవైపు మళ్లిన టికెట్ల వివాదం..!

సినిమా టికెట్ల వివాదం.. అటు తిరిగి... ఇటు తిరిగి... మా ఎన్నికల వైపు మళ్లింది. బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల ప్యానళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలుకొనసాగుతుండగానే.. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల వేడిని మరింత రాజేసింది. సినిమా టికెట్ల వ్యవహారంపై సినీ పరిశ్రమ అంతా సంఘటితంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ నిచ్చారు. మోహన్ బాబు పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... ఇప్పుడు సినీ పరిశ్రమను ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రభుత్వం రేపు... విద్యాసంస్థలను కూడా ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించారు. జగన్ మీ బంధువే కదా... ఈ అంశంపై మాట్లాడండి అంటూ మోహన్ బాబును కోరారు..
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.. మోహన్ బాబు. పవన్ కల్యాణ్ తన గురించి అనడంలో తప్పేమి లేదని.. చాలాకాలం తర్వాత తనను మెల్లగా లాగాడని.. అది తనకు సంతోషమే అంటూ ట్వీట్ చేశారు. మా ఎన్నికల తర్వాత అన్నింటికి సమాధానం చెబుతానని... ఆ లోపు తన కుమారుడు మంచు విష్ణు ప్యానల్‌కు ఓటువేసి గెలిపించాలని ట్విట్టర్ వేధికగా కోరారు.
పవన్ వ్యాఖ్యలకు నేచురల్ స్టార్ నాని కూడా మద్దతు తెలిపారు. సినీ రంగం క్షేమంగా ఉండడమే ముఖ్యమని, పవన్ కల్యాణ్-ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కన పెడుతామన్నారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సినిమా సమస్యలను చిత్తశుద్దితో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. చిత్ర పరిశ్రమలో ఓ సభ్యుడిగా సీఎంజగన్‌కు, మంత్రులకు నేను విజ్ఞప్తిచేస్తున్నానని.. తెలుగు సినిమా మరింత దెబ్బతినకముందే స్పందించాలని నాని కోరారు.
ఇక అటు మంత్రి పేర్ని నాని సైతం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ కేవలం మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. నానితో పాటు ఇతర హీరోల మీద పవన్ కపట ప్రేమ ఏంటో తమకు తెలుసని మంత్రి పేర్ని నాని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com