HBD Chiranjeevi : చిరంజీవి మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

HBD Chiranjeevi : చిరంజీవి మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరులో 1955 ఆగష్టు 22 న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి.. కష్టేఫలి అనే సిద్దాంతాన్ని నమ్ముకొని తన కెరీర్ కి పునాదిరాళ్ళు బలంగా వేసుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని అభిలాషతో ఓ ఛాలెంజ్ లా ఎదురుకుంటూ స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ ప్రేక్షకుల గుండెల్లో ఖైదిగా బంది అయిపోయి మగమహారాజుగా సినీ ఇండస్ట్రీలో శిఖరాగ్రానికి చేరారు. ఇండస్ట్రీకి మెగాస్టార్ అయిన... అభిమానులకి అన్నయ్యే. ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం సైరా అంటూ దూసుకుపోతున్న మన అందరివాడైన చిరంజీవి నేడు 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా Tv5 స్పెషల్ స్టొరీ..!

పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరులో 1955 ఆగష్టు 22 న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు చిరంజీవి. ఆయన అసలు పేరు కొణిదల శివశంకర్ వరప్రసాద్, కానీ.. ఇంట్లో అందరూ శంకరం బాబు అని ముద్దుగా పిలుచుకునేవారు. సినిమా అంటే పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చారు చిరు... 1978లో వచ్చిన "పునాది రాళ్లు" చిరంజీవి నటించిన మొదటి సినిమా.. కాని కొన్ని కారణాల వళ్ళ ప్రాణంఖరీదు అనే సినిమా ముందుగా విడుదల అయ్యింది. మొదటి సినిమాకి గాను అయన అందుకున్న పారితోషికం అక్షరాల 1,116 రూపాయలు..

1983 వరకూ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన చిరంజీవి ఆ తరవాత పూర్తి స్థాయి హీరోగా మారారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడుగా మెగాస్టార్ చిరంజీవి పేరు సంపాదించుకున్నారు. 1980 ఫిబ్రవరి 20న హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి వివాహం జరిగింది. 1983లో తన 62 వ సినిమాగా వచ్చిన "ఖైది" సినిమా చిరంజీవి స్థాయిని అమాంతం పెంచి.. స్టార్ హీరోని చేసింది. అప్పట్లో ఈ సినిమా ఏకంగా కోటి రూపాయల వసూళ్ళు సాదించి.. చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకి గాను చిరంజీవి అందుకున్న పారితోషకం "లక్షా డెబ్బై అయిదు వేలు".

నటనలోనే కాదు డాన్స్ లలో కూడా చిరునే హైలెట్. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే చిరంజీవి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరుకు ఎదిగి నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచారు. 1995, 1996 సంవత్సరంలో చిరంజీవి చేసిన సినిమాలు ఏవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. ఇక 1997లో వచ్చిన "అన్నయ్య" సినిమా మంచి హిట్ అయి చిరంజీవి క్రేజ్ ని నిలబెట్టింది. ఈ తర్వాత మాస్టర్, చూడాలని ఉంది సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు చిరు.

ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా.. తనకి ఇంతటి ప్రేమాభిమానాలు అందించిన అభిమానుల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో.. 1998 అక్టోబర్ లో బ్లడ్ బ్యాక్ ని, ఆ తర్వాత ఐ బ్యాంక్ ని స్థాపించారు. ఇక 2008 ఆగస్టు 26 న తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు ఆయన. 2009 జరిగిన ఎన్నికలో 18 స్థానాలని మాత్రమే గెలుచుకుని.. ఆ తర్వాత పార్టీని 2011, ఫిబ్రవరి 6 వతేదీన కాంగ్రెస్ లో విలీనం చేసి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.

తనని ఎంతగానో అభిమానించే ప్రేక్షకుల కోరిక మేరకు 2017 లో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. 150వ చిత్రంగా వచ్చిన "ఖైది నం150" సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసి.. ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. చిరంజీవి అందించిన సేవలకి గాను జనవరి, 2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి "శ్రీఅబ్దుల్ కలామ్" నుండి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇక అదే సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు కూడా అందుకున్నారు చిరంజీవి.

చిరంజీవి ఇలాగే మరెన్నో సినిమాలు చేస్తూ.. విజయాలను అందుకొని ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుంటూ.. మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది Tv5.


Tags

Read MoreRead Less
Next Story