Pavala Syamala : ఆర్ధిక ఇబ్బందుల్లో పావలా శ్యామల.. అవార్డులని అమ్మి ఇంటి అద్దె..!

Pavala Syamala : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు రెండు వందలకి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు నటి పావలా శ్యామల... ముఖ్యంగా గోలీమార్ సినిమాలో ఆమె కామెడీకి ఎవ్వరైనా పడిపడి నవ్వాల్సిందే.. అయితే ఇప్పుడామె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆరోగ్య సమస్యలతో ఇండస్ట్రీ దూరమై చిన్న ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. ఒకవైపు కూతురి అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో ఆమె పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో ఆమె ఇబ్బందులను తెలుసుకున్న నటి కరాటే కళ్యాణి ఆమెను కలుసుకొని కొంత ఆర్థిక సహాయం అందించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన ఆర్థిక ఇబ్బందుల గురించి పావలా శ్యామల మాట్లాడుతూ.."30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి ఎన్నో అవార్డులు, సత్కారాలు, సన్మానాలు అందుకున్నాను. అనారోగ్య కారణాల చేత ఇండస్ట్రీకి దూరమయ్యాను. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను నా కూతురు అనారోగ్య సమస్యలతో బాధపదుతున్నాం.. మా ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకొని గతంలో మెగాస్టార్ చిరంజీవి 2 లక్షల రూపాయలను.. గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలను పంపించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి నెల ఫించన్ ఇస్తుంది. అయితే గత మూడు నెలల నుంచి ఫించన్ కూడా రావడం లేదు. ప్రస్తుతం ఇల్లు గడవడం కష్టంగా ఉంది. వచ్చిన అవార్డులను కొన్నింటిని అమ్మేసి ఇంటి అద్దె కట్టాను" అని తెలిపింది. కాగా శ్యామలకి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కరాటే కళ్యాణి అన్నారు.
పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల.. రచయిత గణేష్ పాత్రో రచించిన పావలా నాటకంలో నటన ద్వారా ఆమెకి పావలా శ్యామలగా పేరు వచ్చింది. ఈ ఒక్క నాటికలోని ఆమె పాత్రకు 200 అవార్డులు తీసుకున్నారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రావాలా, మనసంతా నువ్వే, గోలీమార్ మొదలగు చిత్రాలలో నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com