ఆ ఇమేజ్‌తో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఏకైక నటి వై విజయ

ఆ ఇమేజ్‌తో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఏకైక నటి వై విజయ
ఒక దశలో వై విజయ కోసమే సెపరేట్ ట్రాక్ రాసుకున్నారు రచయితలు. అంతలా తన స్పెషల్ ఇమేజ్ తో పాపులర్ అయింది.

వై విజయ.. కొన్ని దశాబ్ధాలుగా వెండితెరపై వెలిగిపోతోన్న పేరు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు తనదైన హొయలతో వెండితెరను వేడెక్కించిన నటి తను. వ్యాంప్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న వై విజయ తొలినాళ్లలో శోభన్ బాబు,ఎన్టీఆర్ ల సరసన నటించిందంటే ఆశ్చర్య కలగక మానదు. తెలుగుతెరపై పులుసుగా ప్రసిధ్ధి చెందిన వై విజయ పుట్టినరోజు ఇవాళ (ఫిబ్రవరి 8). ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ, వై విజయ సినీ యానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం.

వై విజయ పుట్టింది కర్నూలులో. చదువుకుంది కడపలో. వెంపటి చినసత్యం వద్ద డ్యాన్స్ నేర్చుకుంది. ఆ సమయంలోనే సినిమా అవకాశం వచ్చింది. రామవిజేతా ఫిలిమ్స్ లో కె బాబురావు దర్శకత్వంలో వచ్చిన తల్లిదండ్రులు తొలి సినిమా. ఇందులో శోభన్ బాబుకు హీరోగా నటించారు. మేటి నటుల కలయికలో వచ్చిన ఈ సినిమా తన ఫస్ట్ ఫిలిమ్ కావడం అదృష్టమే.


కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేదో ఏమో కానీ.. తను మంచి నటి కావాలనుకునే వచ్చినా ఫైనల్ గా వ్యాంప్ క్యారెక్టర్స్ కేరాఫ్ అయింది. కెరీర్ తొలినాళ్లలోనే కె విశ్వనాథ్ తీసిన నిండుహృదయాలు సినిమాలో ఓ పాట చేసింది. తర్వాత పిచ్చోడి పెళ్లి, తల్లికూతుళ్లు వంటి సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో చదువుకు ఫుల్ స్టాప్ పడింది.

తన కెరీర్ లో ఫస్ట్ బ్రేక్ అంటే కమల్ హాసన్ సినిమాతోనే. 1976లో వచ్చిన మన్మథలీల చిత్రంలో కమల్ కు జోడీగా ఓ పాట చేసింది. హలో మైడియర్ రాంగ్ నెంబర్ అంటూ సాగే ఈ పాటతో ఓవర్ నైట్ కోలీవుడ్ కు హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఆ పాటే ఆ తర్వాత తను తమిళంలో 270కిపైగా సినిమాల్లో నటించడానికి కారణం అయింది.

వై విజయ వచ్చే నాటికి ఇండస్ట్రీలో సిల్క్ స్మిత, డిస్కోశాంతి వంటి వారి హవా ఉంది. కానీ వారు పాటలకే పరిమితం అయ్యారు. ఇటు జయమాలిని, జ్యోతిలక్ష్మిల ఇమేజ్ బోర్ కొట్టేస్తోన్న టైమ్ కూడా. ఆ సమయంలో వచ్చిన వై విజయ వ్యాంప్ ఇమేజ్ తో ఆ ముగ్గురినీ తలదన్నే పాత్రలు చేసేసిందంటే ఆశ్చర్యమే.

తొలినాళ్లలో తను ఎక్కువగా తమిళ చిత్రాలే చేసింది. దర్శకులు ఏ పాత్ర ఇచ్చినా చేసుకుంటూ వెళ్లడమే పనిగా పెట్టుకున్నానంటారు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన మన్ వాసనై తెలుగులో మంగమ్మగారి మనవడుగా రీమేక్ అయింది. తమిళ్లోనే కాదు, తెలుగులో తన పాత్ర తనే చేసింది. ఆ పాత్ర ఇక్కడా సూపర్ హీట్ అయింది.

మన్ వాసనై తర్వాతే వై విజయకు తమిళ్ లో ఆఫర్స్ పెరిగాయి. ఆ పాత్రను తెలుగోలనూ తనతో చేయించాలని పట్టుబట్టి చేయించింది ఎస్ గోపాలరెడ్డి. మంగమ్మగారి మనవడు తర్వాతే తను తెలుగులోనూ బిజీ అయ్యారు. ఒకే సినిమాతో రెండు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న నటి వై విజయ.

తమిళ్ లో వై విజయను ప్రోత్సహించిన దర్శకుల్లో భారతీరాజాతో పాటు కె బాలచందర్ కూడా ఉన్నారు. తెలుగులో కోడి రామకృష్ణ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఒక దశలో వై విజయ కోసమే సెపరేట్ ట్రాక్ రాసుకున్నారు రచయితలు. దర్శక నిర్మాతలూ తన ట్రాక్ ఉండాల్సిందే అనుకునేవారు. అంతలా తన స్పెషల్ ఇమేజ్ తో పాపులర్ అయింది.


వ్యాంప్ పాత్రలతో ప్రసిద్ధి చెంది.. అదే ఇమేజ్ తో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఏకైక నటిగా వై విజయను చెప్పొచ్చు. అయితే తెలుగులో వంశీ వై విజయకు నిజంగానే ఓ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫర్ చేశాడు. అన్వేషణ సినిమా చూసిన ఎవ్వరైనా వై విజయ పాత్రను మర్చిపోలేరు. అలాగే లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల వంటి చిత్రాల్లో ఆమె ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా వాడాడు వంశీ.

వంశీ దర్శకత్వంలోనే వచ్చిన లేడీస్ టైలర్.. తన ఇమేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లింది. లేడీస్ టైలర్ రాజేంద్రప్రసాద్ ప్రేమిస్తున్నానంటే నమ్మి అతని కోసం పలవరించే ముదురుబ్యూటీగా తన నటన సోయగాలు ఆ రోజుల్లో సెన్షేషన్ క్రియేట్ చేశాయి.. ఇందులో తనది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఓ గ్రూప్ సాంగ్ కూడా ఉంటుంది.

ఎన్ని సినిమాల్లో ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా.. ఎన్ని డబుల్ మీనింగ్స్ చెప్పినా.. వై విజయ అనగానే గుర్తొచ్చేది పులుసు క్యారెక్టర్. పులుసు రూల్ తో సాగే ఈ పాత్ర ఆ రోజుల్లో వయోభేదం లేకుండా ప్రేక్షకులందరినీ రిపీటెడ్ గా థియేటర్స్ కు రప్పించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మా పల్లెలో గోపాలుడు చిత్రంలోనిదీ పులుసు పాత్ర.

ఒక దశ దాటాక తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. కొన్ని సినిమాల్లో కామెడీ కూడా పండించింది. ఎదురింటిమొగుడు పక్కింటి పెళ్లాంలో వచ్చీరాని తెలుగులో చెప్పే డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. అయినా వై విజయ అంటే రెండు దశాబ్ధాలకు పైగా ప్రేక్షకులకు గుర్తొచ్చేది తను చేసిన వ్యాంప్ తరహా పాత్రలే. ఇవే తనను ఇండస్ట్రీలో నిలబెట్టాయని ఆమె కూడా నమ్ముతారు. సినిమా పాత్రలెలా ఉన్నా.. వై విజయది వెండితెర పాత్రలకు భిన్నమైన వ్యక్తిత్వం. 1985లోనే తమ ఫ్యామిలీ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ఓ కాలేజ్ ప్రిన్సిపల్. వీరికి ఒకే ఒక్క కూతురు ఉంది. తనకు సినిమా వాసన లేకుండానే పెంచారు. ఆ మధ్య పెళ్లి కూడా చేశారు.

వై విజయలా వ్యాంప్ ఇమేజ్ ఉండి.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్న నటి మనకు దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లోనూ కనిపించరు. అదే తన ప్రత్యేకత. తెలుగు కంటే తమిళ్ లో ఎక్కువ సినిమాల్లో నటించిన తను కన్నడ, మళయాల, హిందీ భాషల్లోనూ నటించారు. మొత్తంగా ఒకటే ఇమేజ్ ను వైవిధ్యంగా ప్రెజెంట్ చేసిన వైవిధ్యమైన నటి వై విజయ.

చాలా గ్యాప్ తర్వాత వై విజయని ఎఫ్2 చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాతో తనదైన శైలి పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఆ తర్వాత తెనాలి రామకృష్ణలోనూ నటించిన వై విజయ ఇప్పుడు ఎఫ్2కి సీక్వెల్ గా వస్తున్న ఎఫ్3లోనూ నటిస్తోంది. ఇలానే ఆమె కంటిన్యూగా సినిమాలు చేస్తూ మరింత కాలం ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుబాకాంక్షలు చెబుదాం.

Tags

Read MoreRead Less
Next Story