Sirisilla District : చీమల శివ భక్తి...రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతం.

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. ఈ సృష్టిని నడిపించే లయ కారకుడు ఆ పరమశివుడు అని ఈ నానుడి అర్ధం. చిన్న చీమ కుట్టాలన్న ఆ శివయ్య ఆజ్ఞ ఉండాల్సిందే అంట. మరి ఆ శివయ్య ఆజ్ఞాపించాడో ఏమో కానీ.. ఆ పరమ శివుని లింగం ఆకృతిలో పుట్టను సృష్టించాయి చీమలు. తమకు శివునిపై ఉన్న భక్తిని తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీమలు చేసిన ఈ అద్భుతం అందరితో ఔరా అనిపించేలా ఉంది.
వర్షాకాలంలో చీమలు పుట్టలు పెట్టడం సాధారణ విషయమే. ఐతే ఆ పుట్టలకు సరైన ఆకృతి అంటూ ఏం ఉండదు. తమకు నచ్చినట్టుగా పుట్టలు పెడుతుంటాయి చీమలు. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్ద బోనాల గ్రామంలో అద్భుతం జరిగింది. ఆ ముక్కంటి ప్రతిరూపం అయిన లింగం ఆకారంలో చీమలు పుట్టను సృష్టించాయి. అచ్చం దేవాలయం లో ఉండే శివ లింగం ఆకారంలోనే ఈ పుట్ట ఉండడం విశేషం. ఇక అది చూసిన గ్రామస్తులు, భక్తులు ఇది ఆ శివయ్య లీలల్లో భాగమేనని నమ్ముతున్నారు. శివలింగం ఆకారంలో ఉన్న ఈ పుట్ట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓం నమః శివాయ అనే కామెంట్ల తో భక్తి భావాన్ని వెదజల్లుతున్నారు నెటిజన్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com