Bengaluru : వరద నీటిలోనే బెంగళూరు.. జనం అష్టకష్టాలు

బెంగళూరు నగరం నీట మునిగింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాను భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురిసింది. దాదాపు ఆరు గంటలకుపైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు భారీగా చేరడంతో నగర ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వర్షాల కారణంగా పలు ఆఫీసులు బంద్ ప్రకటించగా, మరికొన్నివర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. కెంగేరిలో అత్యధికంగా 132 మిలిమీటర్ల వర్షపాతం, బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహళ్లిలో 132 మి.మీ నమోదైంది. చాలా ప్రాంతాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైంది. బెంగళూరు నగరంలో సగటు వర్షపాతం 106 మిల్లిమీటర్లుగా రికార్డైంది. ప్రసిద్ధ సిల్క్ బోర్డ్ జంక్షన్, బొమ్మనహళ్లి, హెచ్‌ఆర్‌బీఆర్ లేఅవుట్‌లను వర్షం ముంచెత్తింది. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతం.
వర్షం సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలను బెంగళూరు వాసులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఉత్తర బెంగళూరులో నీరు నిలిచిపోవడంతో నగర పోలీసులు అయ్యప్ప ఆలయానికి దారితీసే న్యూ బెల్ రోడ్డు, సారాయ్‌పల్య వైపు నాగవర బస్ స్టాప్, అల్లసంద్ర నుంచి యలహంక సర్కిల్ వరకు ట్రాఫిక్ హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బీ బసవరాజ్.. సాయి లేఅవుట్‌లోని ప్రభావిత ప్రాంతాన్ని జేసీబీపై ఎక్కి సందర్శించారు. బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముంపు భయంతో నగరవాసులు వణికిపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com