Bangalore : ఐనాక్స్ లో యాడ్స్‌తో టైం వేస్ట్ చేశారని కోర్టులో ఫిర్యాదు

పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యానికి ఝలక్ ఇచ్చాడు న్యాయవాది అయిన ఓ సినీ ప్రేక్షకుడు. అరగంట పాటు యాడ్స్ వేసి తన సమయం వృథా చేశారంటూ బెంగళూరు లాయర్ ఒకరు కోర్టుకెక్కారు. ప్రకటనల కారణంగా షెడ్యూల్ టైం కన్నా థియేటర్ లో ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చిందని, దీనివల్ల ముఖ్యమైన సమావేశానికి హాజరుకాలేకపోయానని వాపోయాడు. దీనికి నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు విచారించిన న్యాయస్థానం.. ఇతరుల సమయం, డబ్బుతో ప్రయోజనం పొందే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానిస్తూ రూ.65 వేలు పరిహారంగా చెల్లించాలని ఐనాక్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అదేవిధంగా రూ. లక్ష జరిమానా విధించింది. నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. బెంగళూరుకు చెందిన అభిషేక్ అనే లాయర్ 2023లో పీవీఆర్ ఐనాక్స్ లో సినిమాకు వెళ్లాడు. బుక్ మై షోలో సాయంత్రం 4.05 గంటల షోకు ‘శామ్ బహదూర్’ అనే సినిమాకు 3 టికెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే, 4.05 గంటలకు సినిమా మొదలుకావాల్సి ఉండగా ప్రకటనల కారణంగా 4:30 గంటలకు ప్రారంభమైంది. సినిమా అరగంట ఆలస్యం కావడంతో తాను ముఖ్యమైన అపాయింట్ మెంట్ రద్దు చేసుకోవాల్సి వచ్చిందని అభిషేక్ వినియోగదారుల కోర్టుకెక్కారు. అనవసరమైన యాడ్స్ తో ప్రేక్షకుల సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఐనాక్స్ యాజమాన్యంపై ఫైరయ్యారు. ప్రభుత్వ సూచనలు, ఆదేశాల ప్రకారమే యాడ్స్ ప్రసారం చేశామని ఐనాక్స్ తరఫున లాయర్ వివరణ ఇచ్చారు. సినిమాను చెప్పిన టైంకు ప్రారంభించి టైంలోగా ముగించాలని.. ఏదున్నా ప్రారంభానికి ముందు ఇంటర్వెల్ లో చూసుకోవాలని కోర్టు సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com