Pune : భర్త కోసం కాలేయ దానం.. ఆ తర్వాత దంపతులు ఇద్దరూ మృతి

Pune : భర్త కోసం కాలేయ దానం.. ఆ తర్వాత దంపతులు ఇద్దరూ మృతి
X

అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ప్రాణాలను కాపాడటానికి తన కాలేయాన్ని దానం చేసిన భార్య, చివరకు భర్తతో పాటు తాను కూడా మరణించిన విషాదకర సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. పుణె జిల్లాకు చెందిన బాపు కోంకర్ కాలేయ వ్యాధితో బాధపడుతూ సహ్యాద్రి ఆసుపత్రిలో చేరారు. కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెప్పడంతో, ఆయన భార్య కామిని తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చింది. ఆగస్టు 15న కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.

ఆపరేషన్ తర్వాత విషాదం

ఆపరేషన్ తర్వాత బాపు ఆరోగ్యం మరింత క్షీణించి, ఆగస్టు 17న మరణించాడు. మరోవైపు కాలేయ దానం చేసిన కామినికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. ఆమె చికిత్స పొందుతూ ఆగస్టు 21న మరణించింది. ఈ ఘటనతో కోంకర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ మరణాలకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, బాపు, కామిని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

విచారణకు ఆదేశం

ఈ విషాద సంఘటనపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. కాలేయ మార్పిడి చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు, రోగుల ఆరోగ్య రికార్డులు, వీడియో ఫుటేజీలు సమర్పించాలని ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. విచారణలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags

Next Story