Maharashtra Beed News: నెలరోజుల్లో వందకు పైగా కుక్కపిల్లల్ని చంపిన కోతులు.. ఎందుకంటే..

Maharashtra Beed News: కుక్కలపై కోతులు పగ తీర్చుకుంటున్నాయా? అంటే ఔననే అంటున్నారు మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు. ఆ గ్రామంలో కుక్కపిల్లలు కనుమరుగైపోయాయట. ఇందుకు కారణం కోతులు వాటిని చంపేయడమే. చెట్లపైకి, ఎత్తయిన భవనాలపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందపడేసి చంపేస్తున్నాయంటున్నారు బీడ్ జిల్లా ప్రజలు.
ఒకవేళ అప్పటికీ చనిపోకపోతే.. మళ్లీ పైకి తీసుకెళ్లి కిందపడేస్తున్నాయంటున్నారు. గత నెల రోజుల నుంచి ఇప్పటివరకు మొత్తం దాదాపు వందకుపైగా కుక్కపిల్లల్ని హత్యచేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఓ కోతి పిల్లని వీధి శునకాలు వెంబడించి హతమార్చిన నేపథ్యంలో.. వాటిపై పగ పెంచుకొన్న కోతులు ఇలా చేస్తున్నాయంటున్నారు స్థానికులు.
5వేల మంది ఉండే లవూల్ అనే గ్రామంలో ప్రస్తుతం ఒక్క కుక్కపిల్ల కూడా బతికి లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బారి నుంచి కుక్కపిల్లల్ని బతికించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి వాటిని ఎత్తుకుపోతున్నాయన్నంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వెళ్లే చిన్నారులపైనా కోతులు దాడులకు పాల్పడుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద తగ్గించాలని వారు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com