భర్తను నదిలోకి తోసేసిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

కొన్ని వార్తలు చదువుతుంటే హవ్వా అని ముక్కున వేలేసుకుంటాం. భర్తలను భార్యలు చంపడం... భార్యల ను భర్తలు చంపడం, చిన్నారులను సైతం చిదిమేయడం లాంటి ఎన్నో ఘటనలను తెల్లవారితే చాలు చూస్తూనే ఉన్నాం. మారుతున్న సమాజంలో కుటుంబ విలువలు ఎలా పడిపోతున్నాయో తెలియజేసే ఉదాహరణలివి. ఆ కృష్ణమ్మ సాక్షిగా సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. సరదాగా సెల్ఫీ తీసుకుందాం అంటూ భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆ నదిలో తోసేసింది ఓ ఇల్లాలు. కింద , మీద పడి ఒడ్డుకు చేరుకున్న ఆ భర్త.. తన భార్య నదిలోకి తోసేసిందంటూ గొడవకు దిగాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తెలంగాణ కర్ణాటక బార్డర్ ల జరిగిన ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల ప్రకారం కర్ణాటక రాయచూరు కు చెందిన తాతప్ప, అతని భార్య బైక్ పై వెళ్తున్నారు. కల్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జి వద్దకు రాగానే బైక్ ని ఆపి చల్లగాలికి కాసేపు సేద తీరుదాం అనుకున్నారు. అయితే కృష్ణమ్మ పరవళ్ల తో సెల్ఫీ తీసుకునే టైం లో తాతప్ప నదిలో పడిపోయాడు. అతనికి ఈత కూడా రాదు. ప్రవాహంలో కొట్టుకుపోతూ నది మధ్యలో బండరాళ్లు దొరకడంతో దానిపైకి చేరాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పొడగాటి తాళ్లను నదిలోకి వేసి తాతప్పను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అయితే నది నుంచి ఆవేశంగా బయటకు వచ్చిన తాతప్ప తన భార్యే నదిలోకి తోసేసిందని గొడవకు దిగాడు. నీళ్లలో మునిగిపోతూ కూడా తాతప్ప అదే ఆరోపణ చేయడం విశేషం. వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భార్యే నదిలోకి తోసేసిందని చెప్పాడు. ఇదంతా చూస్తున్న స్థానికులకు మాత్రం ఎలా స్పందించాలో అర్థం కాలేదు. చివరకు భార్యాభర్తలకు ఇద్దరికీ నచ్చజెప్పి ఇంటికి అయితే పంపించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com