Viral : వర్క్ ఫ్రమ్ థియేటర్.... కార్పోరేట్ వర్క్ కల్చర్‌పై చర్చకు దారితీసిన ఒక్క ఫోటో...

Viral : వర్క్ ఫ్రమ్ థియేటర్.... కార్పోరేట్ వర్క్ కల్చర్‌పై చర్చకు దారితీసిన ఒక్క ఫోటో...
X

వర్క్ ఫ్రమ్ హోమ్...కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఈ కల్చర్ ను తీసుకొచ్చాయి కార్పొరేట్ సంస్థలు. అపుడు ఉన్న పరిస్థితుల దృశ్య ఇంటి నుండే పని చేసే సదుపాయాన్ని కల్పించారు. అయితే రాను రాను కార్పొరేట్ సంస్థలే కాకుండా చిన్న చితక కంపెనీ లు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. ఆడవాళ్లు కూడా ఈ పద్ధతికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రవాణా ఖర్చులతో పాటు ఇంటిని, పిల్లలను చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కి నో చెప్పకుండా పని చేస్తున్నారు. అయితే కొన్ని కార్పొరేట్ సంస్థలు మాత్రం విపరీతమైన పని భారంతో ఉద్యోగులకు రెస్ట్ లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఓ యువతి సినిమా థియేటర్లో వర్క్ చేస్తున్న ఫోటో నెట్టింట దర్శనం ఇచ్చింది. దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఏ రేంజ్ లో ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఇటీవల ఒక వ్యక్తి 'లోక' సినిమా చూసేందుకు బెంగళూరులోని ఓ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ తన ముందు వరుసలో కూర్చున్న యువతి ల్యాప్‌టాప్‌లో తీవ్రంగా పని చేస్తుండటాన్ని గమనించారు. దీనికి ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి ఆ యువతి ఫొటో తీసి రెడిట్‌లో పోస్ట్ చేశారు. "బెంగళూరులో ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం" అని ఆ పోస్ట్ లో రాసారు. ఈ ఫొటో క్షణాల్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. "ఇది 'వర్క్ ఫ్రమ్ హోమ్' కాదు, 'వర్క్ ఫ్రమ్ థియేటర్'లా ఉంది," అని వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ఇది కేవలం ఒక ఫొటో మాత్రమే కాదు, బెంగళూరులో నెలకొన్న వర్క్ కల్చర్, పని ఒత్తిడికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వకుండా కొన్ని కంపెనీలు ఉద్యోగులను బానిసల్లా చూస్తున్నాయని, వారి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నాయని నెటిజన్లు విమర్శించారు. మొత్తానికి ఈ ఫోటో కార్పొరేట్ వర్క్ కల్చర్ పై సరికొత్త చర్చకు దారితీసింది.

Tags

Next Story