India-US Trade Deal : అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందం..ఇక మన బియ్యం కోసం క్యూ కట్టనున్న విదేశీయులు.

India-US Trade Deal : భారతీయ రైతన్నల కష్టానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కే రోజులు దగ్గరపడ్డాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలతో కుదుర్చుకుంటున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాల ద్వారా భారత వ్యవసాయ రంగానికి ఏకంగా 400 బిలియన్ డాలర్ల భారీ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పటివరకు అమెరికాకు మన దేశం చేస్తున్న వ్యవసాయ ఎగుమతులు కేవలం 2.8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, ఈ కొత్త ఒప్పందంతో మన ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీయుల ప్లేట్లలోకి చేరనున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే భారీ పరిణామమని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
అమెరికాతో జరగబోయే ఈ కీలక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ముసాయిదాను ఖరారు చేసేందుకు భారత అధికారుల బృందం వచ్చే వారం అమెరికా వెళ్లనుంది. వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23 నుంచి ఈ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చి నెలలోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరగవచ్చు. ముఖ్యంగా మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, భారత రైతులకు నష్టం కలిగించే డైరీ, పౌల్ట్రీ, ధాన్యాల వంటి సున్నితమైన రంగాల్లో విదేశీ దిగుమతులకు ఎలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు బ్రిటన్‌తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పట్టాలెక్కేలా కనిపిస్తోంది. గతేడాది జూలైలో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం.. భారత్ నుంచి బ్రిటన్ వెళ్లే దాదాపు 99 శాతం వస్తువులపై జీరో టారీఫ్ వర్తిస్తుంది. అంటే మన ఉత్పత్తులు అక్కడ చౌకగా లభిస్తాయి, ఫలితంగా ఎగుమతులు పెరుగుతాయి. ప్రతిగా భారత్ కూడా బ్రిటన్ నుంచి వచ్చే కార్లు, విస్కీ వంటి ఉత్పత్తులపై దశలవారీగా పన్నులను తగ్గించనుంది. ఏప్రిల్ కల్లా దీనిని అమలు చేయాలని రెండు దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ ఎగుమతులు 51-52 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, దిగుమతులు 35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ కొత్త ట్రేడ్ డీల్స్ ద్వారా ఎగుమతుల విలువను అమాంతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రదేశాలతో పోటీ పడుతూ మన వ్యవసాయ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడమే ఈ ఒప్పందాల అసలు ఉద్దేశం. కేవలం అమెరికా, బ్రిటన్ మాత్రమే కాకుండా, లాటిన్ అమెరికన్ దేశాల సమూహం అయిన మెర్కోసూర్తో కూడా వాణిజ్య చర్చలు వేగంగా జరుగుతున్నాయి.
విదేశాలతో వాణిజ్య ఒప్పందాలు అనగానే భారత రైతులు ఆందోళన చెందడం సహజం. అయితే భారత ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో కచ్చితమైన నిబంధనలను పాటిస్తోంది. స్వదేశీ మార్కెట్‌ను దెబ్బతీసే దిగుమతులపై ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా, కేవలం మన వస్తువులను విదేశాల్లో సులభంగా విక్రయించుకునేలా మార్గాన్ని సుగమం చేస్తోంది. ఈ అంతర్జాతీయ డీల్స్ వల్ల భారతీయ రైతులకు గిట్టుబాటు ధర దక్కడమే కాకుండా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కూడా భారీ ఊతం లభించనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
