Tanzania: వరదలతో అతలాకుతలమైన టాంజానియా..

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా అతలాకుతలమవుతోంది. శనివారం ఉత్తర టాంజానియాలో కురిసిన వర్షానికి వరదలు సంభవించాయి. రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటేష్ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా సంభవించిన వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హస్సన్ ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ జరుగుతున్న కాప్28 పర్యావరణ సదస్సు కోసం ఆమె దుబాయ్ వెళ్లారు. ఇక దేశంలోని ప్రస్థుత పరిస్థితిని అధికారులు అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రజలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com