WAR: యుద్ధానికి 500 రోజులు...9000 వేల మంది మృతి

ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనికచర్య మొదలై 500 రోజులు పూర్తయింది.గతేడాది ఫిబ్రవరి 24న ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో మాస్కో దాడులు మొదలుపెట్టగా.... ఇప్పటికీ కూడా యుద్ధం ముగుస్తుందనేందుకు ఎలాంటి సంకేతాలు కనిపించడంలేదు. రష్యా భీకరదాడులతో ఉక్రెయిన్‌లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగానే కొనసాగుతోంది. మొదట్లో పుతిన్ సేనలు దూకుడు కనబర్చినా....ఆ తర్వాత పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో జెలెన్‌స్కీ సైన్యం కూడా ఎదురుదాడులకు దిగుతోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇప్పటివరకు 9వేలమందికిపైగా పౌరులు మరణించినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మృతుల్లో 500మంది చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొంది. వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. యుద్ధంలో పౌర మరణాలను ఐరాస తీవ్రంగా ఖండించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మృతులసంఖ్య సగటు తక్కువగా ఉన్నప్పటికీ మే, జూన్‌లో మళ్లీ పెరుగుదల కనిపించినట్టు ఐరాస తెలిపింది. జులై 7నాటికి 2 లక్షల 32వేల మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. 63లక్షల మంది ఉక్రెనీయన్లు శరణార్థులుగా మారగా....60లక్షల మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ భూభాగంలో 17శాతం రష్యా ఆక్రమణలో ఉన్నట్లు ఐరాస తెలిపింది.
అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తూర్పువైపు విస్తరణను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఉక్రెయిన్‌పై సైనికచర్య పేరుతో దాడులు ప్రారంభించారు. పేరుకు మాత్రమే రష్యా- ఉక్రెయిన్ యుద్ధమైనా ప్రస్తుతం నాటో-రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధంలా పరిస్థితి తయారైంది. రష్యాపై ఎదురుదాడి చేసేందుకు పశ్చిమదేశాలు ఉక్రెయిన్‌కు భారీఎత్తున ఆయుధ సాయం అందిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులను అందజేయాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. దీంతో ఉక్రెయిన్-రష్యా మధ్య దాడులు మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
500 రోజులుగా రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైనికుల ధైర్య సాహసాలను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ప్రశంసించారు. మాస్కో ఆక్రమణ నుంచి ఉక్రెయిన్ సేనలు విముక్తం చేసిన నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్‌నుంచి జెలెన్‌స్కీ ప్రసంగిస్తూ దీవి విముక్తి కోసం పోరాడిన సైనికులను, ఉక్రెయిన్‌లోని మిగతా బలగాలను పొగడ్తలతో ముంచెత్తారు. ఉక్రెయిన్ తన భూభాగంలోని ప్రతి అంగుళాన్ని తిరిగి దక్కించుకుంటుందనడానికి ఈ దీవిపై పట్టును తిరిగి దక్కించుకోవడమే నిదర్శనమని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన తొలి రోజయిన గత ఏడాది ఫిబ్రవరి 24నే రష్యా నల్ల సముద్రంలోని చిన్న దీవి అయిన స్నేక్ ఐలాండ్‌ను తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ తర్వాత ఉక్రెయిన్ ఈ దీవిలోని రష్యా సైనిక స్థావరంపై స్థాయిలో బాంబుల వర్షం కురిపించడంతో రష్యా జూన్ 30న ఆ దీవిని వదిలిపెట్టాల్సి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com