US Tariff : అమెరికా 500% బాదుడుకు భారత్ అదిరిపోయే బదులు..తగ్గేదేలే అంటున్న ఢిల్లీ.

US Tariff : అమెరికా 500% బాదుడుకు భారత్ అదిరిపోయే బదులు..తగ్గేదేలే అంటున్న ఢిల్లీ.
X

US Tariff : భారత ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచాలన్న అమెరికా ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత హుందాగా, అంతే ధాటిగా స్పందించింది. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లుపై తాము నిశితంగా నిఘా ఉంచామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతే తమకు ప్రాధాన్యమని, ప్రపంచ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. తమ నిర్ణయాలు జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయని, ఇతరుల ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఇటీవల అమెరికా వాణిజ్య కార్యదర్శి ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని మోదీయే కారణమన్నట్లుగా వ్యాఖ్యానించారు. ట్రంప్ మోదీ ఫోన్ కాల్ కోసం ఎదురుచూశారని, కానీ మోదీ ఫోన్ చేయకపోవడంతో అమెరికా ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుని భారత్‌పై పన్నులు పెంచిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని MEA పేర్కొంది.

నిజానికి, 2025 ఫిబ్రవరి 13 నుంచి భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు చాలా సీరియస్‌గా జరుగుతున్నాయి. ఈ చర్చలు చివరి దశకు కూడా చేరుకున్నాయి. అమెరికా వైపు నుంచి వచ్చిన బహిరంగ ప్రకటనలు వాస్తవ స్థితిని ప్రతిబింబించడం లేదని భారత్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఫోన్ చేయలేదన్న వాదనను తిప్పికొడుతూ.. 2025 ఏడాదిలోనే ప్రధాని మోదీ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య ఏకంగా 8 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని భారత విదేశీ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు సుదీర్ఘంగా చర్చించారని తెలిపింది.

వాణిజ్య ఒప్పందాలు అనేవి పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికన జరగాలి తప్ప ఇలాంటి తప్పుడు ఆరోపణలతో కాదని భారత్ పరోక్షంగా చురకలు అంటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. దీనిని అమెరికా అడ్డుకోవాలని చూస్తున్న నేపథ్యంలో, భారత్ ఇచ్చిన ఈ సమాధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నుల బెదిరింపులకు లొంగకుండా తమ మార్కెట్‌ను, దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటామని భారత్ భరోసా ఇచ్చింది.

Tags

Next Story