South Africa: ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవ దహనం

దక్షిణాఫ్రికా జొహన్నెస్‌బర్గ్‌లో ఓ బహుళ అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి 52 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. జోహన్నెస్‌బర్గ్ నగరంలో ఉన్న ఒక ఐదు అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అత్యంత ఘోరమైన ఘటనలో 52 మంది ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది భారీగా ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ప్రస్తుతానికి మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి. అయితే మంటలు తగ్గి భవనమంతా దట్టమైన పొగలు అలుముకొని సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.
అయితే ప్రమాద సమయంలో ఆ భవనంలో 200 మంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇప్పటి వరకు 52 మృతదేహాలను గుర్తించినట్లు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. మరో 50 మంది గాయపడగా వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి కారణాలు తెలియరాలేదు. అలాగే తెల్లవారుజామున అందరూ గాఢ నిద్ర పోతున్న సమయంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు బాధితులు ఎలాంటి లీజ్ అగ్రిమెంట్లు లేకుండానే ఆ భవనంలో నివాసం ఉంటున్నారని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు. అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడం, వెతకడం కష్టంగా మారిందని వెల్లడించారు. భవనంలో 200 మంది నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెప్పడంతో మృతుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భవనంలో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com