Modi Italy Tour: ఇటలీలో మోదీ.. పలు కీలక అంశాలపై ఐరోపా అధ్యక్షులతో చర్చ..

Modi Italy Tour (tv5news.in)
Modi Italy Tour: ఐరోపా పర్యటనలో భాగంగా శుక్రవారం ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ నాయకులతో వివిధ కీలక అంశాలపై చర్చించారు. శని ఆదివారాల్లో జరిగే జి-20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీ.. పియాజా గాంధీ ప్రదేశం దగ్గర గాంధీ విగ్రహం ముందు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అక్కడి భారత సంతతి ప్రజలతో ముచ్చటించారు. అనంతరం అధికారిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్ మైకెల్, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయాన్‌తో సమావేశమయ్యారు. భారత్-ఈయూ నడుమ స్నేహసంబంధాల గురించి, ముఖ్యంగా.. రాజకీయ, భద్రత సంబంధాల గురించి, వాణిజ్యం, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాల గురించి వారి భేటీలో చర్చకు వచ్చినట్టు పీఎంవో ట్విటర్‌లో తెలిపింది.
అనంతరం.. ఈయూ నేతలతో అద్భుతమైన సమావేశం జరిగినట్టు మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు భారత టీకా కార్యక్రమాన్ని వాన్ డెర్ అభినందించారు. టీకా ఎగుమతులును మళ్లీ భారత్ ప్రారంభించడంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా గత ఏడాది జి-20 సదస్సు వర్చువల్‌గా నిర్వహించారు. ఇటలీ పర్యటన అనంతరం మోదీ.. కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ బయల్దేరి వెళతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com