Global Heat: పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు

వాతావరణ మార్పులు భూమికి ఎప్పుడూ అతిపెద్ద సవాల్. ఎందుకంటే నిత్యం పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఏటేటా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కాలంతో సంబంధం లేకుండా ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇది ఎండకాలమా వర్షకాలమా లేదా చలికాలమా చెప్పడానికి వీలు లేకుండా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంగా అనేక సమస్యలకు కారణమవుతుంది. దీనిపై ప్రోసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక పరిశోధన ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే సింధులోయను అనుకోని ఉన్న భారత్, పాకిస్థాన్, చైనా, ఆఫ్రికాలోని పలు అధిక జనసాంద్రత గల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని ఆ నివేదిక వెల్లడించింది.
ఉష్ణోగ్రతలు పెరిగితే సింధులోయను అనుకుని ఉన్న భారత్, పాకిస్థాన్‌లోని 220 కోట్లమంది, తూర్పు చైనాలోని 100కోట్లమంది, ఆఫ్రికాలోని 80కోట్ల మంది తట్టుకోలేని తీవ్రమైన వేడిని అనుభవిస్తారని తెలిపింది. అలాగే, అధిక ఉష్ణోగ్రత నగరాలుగా దిల్లీ, కోల్‌కతా, షాంఘై, ముల్తాన్, నాన్జింగ్, వుహాన్ వంటివి ఉండనున్నాయి. ఈ ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందుతోన్న, తక్కువ మధ్య ఆదాయ ప్రాంతాలే. ఇక్కడి ప్రజలు ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో పని చేస్తుండటంతో ఎండకు వీరు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉందని వారంటున్నారు.
2015లో 196 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్-IPCC ప్రకారం, ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా. అందువల్ల ఆయా దేశాలు వాతావరణ మార్పులతో ఏర్పడే విపరీతమైన, విధ్వంసక ప్రభావాలను నివారించడానికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని నిర్ణయించాయి. అందుకోసం 2030 నాటికి ప్రపంచం ఉద్గారాలను సగానికి తగ్గించాలని IPCC నొక్కి చెప్పింది. గ్లోబల్ ఏజెన్సీల ప్రకారం, గత నాలుగు నెలలు అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరులో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో 2023 అత్యంత వేడి సంవత్సరంగా అవతరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com