Afghanistan Crisis: ఉగ్రవాదుల మారణహోమం తర్వాత మారిన పరిస్థితులు..

అఫ్గానిస్థాన్‌లో కల్లోల పరిస్థితులు, ఉగ్రవాదుల మారణహోమం నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందే ప్రజల తరలింపు ప్రక్రియను పలు దేశాలు పూర్తిచేస్తున్నాయి. ఆగస్టు 31లోగా అమెరికన్లను స్వదేశానికి తీసుకెళ్లాలని తాలిబన్లు...USకు డెడ్‌లైన్ పెట్టిన నేపథ్యంలో...అగ్రరాజ్యం కంటే రెండ్రోజుల ముందే మిగతా దేశాలు...తమ వాళ్లను స్వదేశానికి తరలింపు ప్రక్రియను ముగించాలని నిర్ణయించాయి.
మరోవైపు తమను తీసుకెళ్లాలంటూ అఫ్గాన్ వాసుల నుంచి వెల్లువెత్తుతున్న దరఖాస్తుల స్వీకరణను ఇప్పటికే పలు దేశాలు నిలిపేశాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, పోలండ్‌తోపాటు బెల్జియం, జపాన్ దేశాలు తరలింపు పూర్తయినట్లు ప్రకటించాయి. మరోవైపు కాబుల్‌లో పేలుళ్లు జరిగినప్పటికీ... తమ వాళ్లను స్వదేశం తీసుకెళ్లే ప్రక్రియ ఆపబోమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఈ నెల14 నుంచి తాము లక్షా పదివేల మందిని అప్గాన్ నుంచి తరలించినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.
అఫ్గాన్ నుంచి బ్రిటన్‌కు వెళ్లేందుకు అర్హత, అనుమతి ఉన్నవారందరినీ తరలించినట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కాబుల్ నుంచి బ్రిటన్ వాయుసేన విమానాల ద్వారా 15 వేల మందిని తీసుకెళ్లామని వెల్లడించారు. ఇంకా మిగిలిఉంటే తరలించేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైరపు కాబుల్ నుంచి 500 మంది జర్మన్లు, 4 వేల మంది అఫ్గానీలు సహా మొత్తం 5,437 మందిని తరలించినట్టు జర్మనీ తెలిపింది.
అటు కాబుల్ నుంచి తమ ప్రజలను పాకిస్థాన్‌కు తరలించే ప్రక్రియ పూర్తయినట్లు బెల్జియం ప్రకటించింది. పోలండ్ కూడా తమ పౌరుల తరలింపు ముగిసినట్టు స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రితో కాబుల్ నుంచి తమవాళ్ల తరలింపు పూర్తయిందని ఫ్రాన్ పేర్కొంది. అఫ్గాన్‌లో మిగిలిన తమ పౌరులు, సిబ్బందిని శుక్రవారం 4 మిలటరీ విమానాలలో సురక్షితంగా తీసుకొచ్చినట్టు జపాన్ ప్రకటించింది. కాబుల్ హమీద్ కర్జాయ్ ఎయిర్ పోర్టులో ఉన్న తమ పౌరులందరిని శుక్రవారం చివరి విమానంలో తరలించామని ఇటలీ విదేశాంగ మంత్రి తెలిపారు.
మరోవైపు ఆగస్టు31 లోగా...అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ, పౌరల తరలింపు ప్రక్రియను పూర్తిచేసేందుకు...అమెరికా జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. 4వేల మందికి తాత్కాలికంగా ప్రత్యేక ఆశ్రయమిచ్చేందుకు పొరుగునున్న పాకిస్థాన్ సన్నాహాలు చేస్తోంది. నాటో దళాలకు మద్దతుగా పనిచేసిన అఫ్గాన్లను తరలించేందుకు సాయం చేయాలంటూ అమెరికా విజ్ఞప్తి చేయడంతో... పాక్ ఇందుకు అంగీకరించింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక సుమారు ఐదు లక్షల పదిహేన వేలమంది ఆ దేశం నుంచి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని యూఎన్‌వో శరణార్థుల విభాగం వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com