Afghanistan: భారత్‌పై పాకిస్థాన్ ఆరోపణలు... తీవ్రంగా స్పందించిన ఆఫ్ఘనిస్థాన్

Afghanistan: భారత్‌పై పాకిస్థాన్ ఆరోపణలు... తీవ్రంగా స్పందించిన ఆఫ్ఘనిస్థాన్
X
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని స్పష్టీకరణ

తమ దేశానికి, పాకిస్థాన్‌కు మధ్య జరుగుతున్న సరిహద్దు ఘర్షణల వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను ఆఫ్ఘనిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అర్థరహితమని కొట్టిపారేసింది. ఈ క్లిష్ట సమయంలో భారత్‌తో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని స్పష్టం చేస్తూ పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

అల్ జజీరా వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "భారత్‌పై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, అహేతుకమైనవి, ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి. మా భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే విధానం మాకు లేదు. ఒక స్వతంత్ర దేశంగా భారత్‌తో మాకు సంబంధాలు ఉన్నాయి. మా జాతీయ ప్రయోజనాల మేరకు ఆ బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటాం" అని తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడైన యాకూబ్ స్పష్టం చేశారు.

ఇటీవల అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రమయ్యాయి. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) వంటి ఉగ్రవాద సంస్థలకు ఆఫ్ఘన్ ఆశ్రయం ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఆఫ్గనిస్థాన్‌తో తమ సంబంధాలు దెబ్బతినడానికి భారతే కారణమని, తాలిబన్ ప్రభుత్వం భారత్ ఒడిలో కూర్చొని తమపై ప్రాక్సీ యుద్ధం చేస్తోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

పాకిస్థాన్ చేసిన ఈ ఆరోపణలను భారత్ కూడా దీటుగా తిప్పికొట్టింది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ, తమ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశాలపై నిందలు వేయడం పాకిస్థాన్‌కు అలవాటేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బదులిచ్చారు.

ప్రస్తుతం తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించనప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆఫ్ఘన్ రక్షణ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags

Next Story