Justin Trudeau: భారత్‌ను రెచ్చగొట్టాలని కాదు, కానీ..

Justin Trudeau:   భారత్‌ను రెచ్చగొట్టాలని కాదు, కానీ..
X
భారత్‌తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు స్పష్టీకరణ

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇరుదేశాల మధ్య దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ట్రూడో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. భారత్‌ను రెచ్చగొట్టాలని లేదా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదన్నారు. కానీ సిక్కు నేత హత్యను మాత్రం తీవ్రంగా పరిగణించాలని తాము భారత్‌ను కోరుతున్నామన్నారు.

కెనడాలో ఖలిస్థానీ ఆందోళనల విషయంలో భారత్‌-కెనడా మధ్య రాజుకొన్న విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఖలిస్థానీ ఉగ్రవాది, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌(కేటీఎఫ్‌) కీలక నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో ఖలిస్థానీ ఉద్యమంపై పక్షపాత ధోరణితో వ్యవహరించే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యలు మరింత చిచ్చు రాజేశాయి. నిజ్జర్‌ను భారత ప్రభుత్వమే హత్య చేయించిందని, ఈ మేరకు తనకు విశ్వసనీయ సమాచారం ఉన్నదని ఆరోపణలు చేశారు. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉన్నదని, కెనడియన్‌ ప్రభుత్వ ఏజెన్సీలు ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.


సోమవారం ఆ దేశ పార్లమెంట్‌లో ట్రూడో మాట్లాడుతూ నిజ్జర్‌ హత్య అంశాన్ని జీ20 సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీతో కూడా చర్చించానని పేర్కొన్నారు. తమ దేశంలో తమ దేశ పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ హస్తం ఆమోదనీయం కాదని, కెనడా సార్వభౌమాధికారాన్ని ఉల్లఘించినట్టేనని ట్రూడో అన్నారు. ఆరోపణలతో ఆగకుండా ట్రూడో వ్యాఖ్యల అనంతరం ఆ దేశ ప్రభుత్వం అక్కడి భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడాలోని భారత దౌత్య కార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి పవన్‌ కుమార్‌ రాయ్‌ను బహిష్కరించినట్టు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ తెలిపారు.

నిజానికి కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థానీల ఆందోళనలుపై ట్రూడో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉ న్నాయి. అయితే తాజాగా నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు, భారత దౌత్యవేత్త బహిష్కరణపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ప్రతి చర్యగా భారత్‌లోని కెనడా సీనియర్‌ దౌత్యవేత్త ఒలివియర్‌ సిల్వెస్టర్‌ను భారత ప్రభుత్వం మంగళవారం బహిష్కరించింది. ఐదు రోజుల్లోగా దేశాన్ని విడిచిపోవాలని ఆదేశించింది. కెనడా దౌత్యవేత్త బహిష్కరణపై సమాచారం ఇచ్చేందుకు భారత విదేశాంగ శాఖ కెనడా హైకమిషనర్‌కు సమన్లు ఇచ్చింది.


దీంతో ట్రూడో మాట మార్చారు. భారత్‌ను తాము రెచ్చగొట్టాలని, లేదా ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదంట వ్యాఖ్యానించారు. సిక్కు నేత హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నామని చెప్పారు. ప్రతి విషయం స్పష్టంగానే ఉందని, అంతా సరైన ప్రక్రియలో సాగుతోందని నిర్ధరించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ట్రూడో తెలిపారు.

Tags

Next Story