Khalistani :భారత్ ఆరోపణల్లో నిజం లేదు

భారత్ కు వ్యతిరేకంగా కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదం పెరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కెనడాను భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఆ దేశం సరైన రీతిలో స్పందించడం లేదు. సరికదా ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు భారత్‌నే తప్పుబడుతున్నారు. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోతున్న క్రమంలో వారిపై చర్యలు తీసుకోకపోగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌నే తప్పుపట్టారు. ఓట్ల కోసమే అతివాద సిక్కు ఖలిస్థాన్ వాదంపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని భారత్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. హింస, బెదిరింపులను కెనడా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఉగ్రవాదంపై తాము ప్రతిసారి కఠిన చర్యలు తీసుకున్నామని అదే తీరు కొనసాగిస్తామని ట్రూడో చెప్పారు. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగిన తీరును ఓ శకటం పై ఉత్సవంగా నిర్వహించారు. భారత వ్యతిరేక పోస్టర్లను ప్రదర్శించారు. ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవాలని కెనడాకు భారత్ పలుమార్లు సూచించడంతోపాటు ఆ దేశ రాయబారికి సమన్లు కూడా జారీ చేసింది. అయినప్పటికీ జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. అటు జులై 8న కెనడాలో ‘ఖలిస్థాన్ ఫ్రీడం ర్యాలీ' నిర్వహిస్తామంటూ పోస్టర్లు చక్కర్లు కొడుతున్నాయి.
జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. కెనడాతో పాటు మరికొన్ని దేశాల్లో భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించే ఖలిస్థానీ పోస్టర్లు వెలువడిన నేపథ్యంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో తీవ్రవాదానికి, తీవ్రవాద అంశాలకు చోటు ఇవ్వకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. ఆ పోస్టర్లను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని ఇప్పటికే కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అలాగే కెనడా ప్రధాని ట్రూడో స్పందనపై వచ్చిన కథనాలను చూసినట్లు వెల్లడించారు. ఇక్కడ సమస్య భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కాదని హింసను, వేర్పాటు వాదాన్ని ప్రచారం చేసుకోవడానికి, ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి ఆ స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com