Bangladesh : బంగ్లాలో రెచ్చిపోయిన నిరసనకారులు.. మళ్లీ విధ్వంసం

బంగ్లాదేశ్లో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పంటించారు. అది కూడా షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తున్న సమయంలో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హసీనా స్పందించారు. విధ్వంసంపై మండిపడ్డారు. వారు భవనాన్ని కూల్చివేయవచ్చు కానీ చరిత్రను కాదని గుర్తించుకోవాలన్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో షేక్ హసీనా ప్రసంగిస్తే బుల్డోజర్ ఊరేగింపు నిర్వహించాలని నిరసనకారులు పోస్ట్ లు పెట్టారు. అవామీ లీగ్ నిర్వహించిన సమావేశంలో షేక్ హసీనా వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలోనే హసీనా తండ్రి రెహమాన్ నివాసం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చారు. ఇంట్లోకి చొరబడి అక్కడ ఉన్న వస్తువులను. రెహమాన్ చిత్రపటాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ ఇల్లు అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమని, అంతేకాక 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని నిరసనకారులు ప్రతిజ్ఞ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com