Canada: నిజ్జర్‌ హత్య కేసులో మరో అనుమానితుడి అరెస్టు

Canada: నిజ్జర్‌ హత్య కేసులో  మరో అనుమానితుడి అరెస్టు
X
నాలుగవ భారతీయుడ్ని అరెస్ట్ చేసిన కెనడా

గతేడాది జూన్‌లో హత్యకు గురైన ఖలిస్థాన్‌ వేర్పాటువాది నిజ్జర్‌ హత్య కేసులో మరో భారత జాతీయుడిని అరెస్ట్‌ చేసినట్టు కెనడా పోలీసులు వెల్లడించారు. తాము అరెస్ట్‌ చేసిన వ్యక్తి బ్రాంప్టన్‌లో నివసించే అమన్‌దీప్‌ సింగ్‌(22) అని తెలిపారు. నిందితుడిపై ఫస్ట్‌-డిగ్రీ మర్డర్‌, హత్యకు కుట్ర పన్నారన్న అభియోగాలపై కేసు నమోదు చేశామని చెప్పారు. నిజ్జర్‌ హత్య కేసులో ఇప్పటికే ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గతేడాది గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని సర్రేలో కాల్చిచంపారు. ఈ కేసులో నలుగురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన నాలుగో అరెస్ట్‌పై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. కెనడా నుంచి అసలు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. విచారణకు సంబంధించిన ఏదైనా సాక్ష్యాలు, సమాచారం ఉంటే తమతో పంచుకుంటే దర్యాప్తుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.

‘‘ మా పరిశోధనా ఏజెన్సీలు విచారణ జరిపేందుకు నిర్ధిష్టమైన, విలువైనవి మేము ఎప్పుడూ అందుకోలేదు. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా ఏమీ మారినట్లు నాకు తెలియదు’’ అని జైశంకర్ చెప్పారు. విదేశీయుల అరెస్ట్ జరిగినప్పుడు సాధారణంగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు తెలియజేస్తారని జైశంకర్ జోడించారు. గతేడాది జూన్ 18న సర్రేలోని గురుద్వారా వెలుపల చంపబడ్డాడు. అయితే, నిజ్జర్‌ని భారత్ ఖలిస్తానీ ఉగ్రవాదిగా గుర్తించింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) పేరుతో భారత వ్యతిరేకతను ప్రోత్సహించాడు.

నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రేరేపిత, అసంబద్ధ వ్యాఖ్యలుగా వర్ణించింది. దీంతో పాటు కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దిగజారాయి.

Tags

Next Story