AP : కోడి కత్తి ఘటనలో కుట్ర కోణం లేదు : NIA

కోడి కత్తి సంఘటనలో కుట్ర కోణం ఏదీ లేదని సుదీర్ఘ దర్యాప్తు తర్వాత తేలిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, బాధితుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా లోతుగా విచారణ చేయాలని వేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కోరుతూ.. ఎన్‌ఐఏ ఇవాళ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో ఏ సంబంధం లేదని ఎన్‌ఐఏ కౌంటర్‌లో పేర్కొంది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడి కత్తి శ్రీను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని తమ సుదీర్ఘ దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ వెల్లడించింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని పేర్కొంది.
కోడి కత్తి దాడిలో కుట్ర కోణం ఉందని.. లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10న జగన్‌మోహన్‌రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్‌ఐఏ కోరింది. అయితే వాదనలకు రెండు రోజుల సమయం కావాలని జగన్ తరపు లాయర్లు కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇక వాయిదాలు ఇవ్వొద్దని నిందితుడి తరపు న్యాయవాది అభ్యర్థించారు. కేసు ఈనెల 17వ తేదీకి వాయిదా పడింది. ఎన్‌ఐఏ తరపున పీపీ విశాల్‌గౌతమ్ కౌంటర్ దాఖలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com