Trump : ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.. పలు దేశాధినేతలకు ఫోన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఫలితాల అనంతరం పలువురు దేశాధినేతలతో ఆయన ఫోన్‌లో ముచ్చటించారు. ఈసందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడిన ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు సమాచారం. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. ఫోర్లిడాలోని తన ఎస్టేట్ నుంచి ట్రంప్.. పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడినట్లు సదరు కథనం వెల్లడించింది. ఐరోపాలో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేసినట్లు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్ యుద్ధం పై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు సూచించినట్లు తెలిపింది. తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. తాను యుద్ధాన్ని ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ భరోసానిచ్చారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు ఇటీవల పుతిన్ అభినందనలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com