Hongkong: హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం..44 మంది సజీవ దహనం

హాంకాంగ్‌లోని తాయ్ పో ప్రాంతంలో ఉన్న వాంగ్ ఫుక్ కోర్ట్ నివాస సముదాయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని హాంకాంగ్ పోలీసులు గురువారం మీడియా సమావేశంలో ధ్రువీకరించారు.
ఈ ఘటనకు సంబంధించి నరహత్య ఆరోపణల కింద ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హాంకాంగ్ పోలీసులు తెలిపారని చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంకా 279 మంది గల్లంతయ్యారని, 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 2:51 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 6:22 గంటలకు దీనిని నెం.5 స్థాయి ప్రమాదంగా ప్రకటించారు. ఒక భవనంలో మొదలైన మంటలు ఏడు ఇతర భవనాలకు వ్యాపించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం అన్ని వనరులను సమీకరించి సహాయక చర్యలకు పూర్తి మద్దతు ఇస్తుందని జాన్ లీ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు అవసరమైన వస్తువులను విరాళంగా అందిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

