Thailand : బాణాసంచా గోదాంలో పేలుడు

Thailand : బాణాసంచా గోదాంలో పేలుడు
9 మంది మృతి 115 మందికి గాయాలు

థాయిలాండ్‌ నరాతీవట్‌ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక టపాసుల గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. 115 మందికి గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి సుంగయ్‌ కొలొక్‌ ప్రాంతంలోని అనేక ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. వాహనాలు కాలి బూడదయ్యాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, గోడలు కూలిపోయాయి.



ఘటనాస్థలంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. బాణాసంచా గోదాం వద్ద నిర్మాణ పనులు చేపట్టడమే ప్రమాదానికి కారణమని థాయ్‌ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి బాణాసంచాపై పడ్డట్లు భావిస్తున్నారు. మలేషియా సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణంలో పేలుడు కారణంగా 500 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడు వల్ల 100 మీటర్ల దూరంలో ఉన్న ఇల్లు కూడా కనిపించాయి.భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాల్ని అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, గోదాం శిథిలాల్లో ఎవరైనా చిక్కుకున్నారా అని అధికారులు వెతుకుతున్నారు.

ఈ పేలుడు ఘటనలో గాయపడిన వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఆసుపత్రికి పంపినట్లు థాయ్‌లాండ్‌ ప్రధాన మంత్రి ప్రయుత్ చాన్ ఓచా చెప్పారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story