Bangladesh Chief : ఉద్రిక్తత నడుమ బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సమావేశం వివాదాస్పదమైంది. వీరంతా కుట్రలో భాగమని ఆరోపిస్తూ వందలాదిగా నిరసనకారులు సుప్రీం కోర్టును చుట్టుముట్టారు. గంటలోనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వెళ్లిపోయారని వార్తలు వచ్చినా చివరికి రాజీనామా చేయక తప్పలేదు. ఆయన హసీనాకు అనుచరుడని పేరుంది.
ఆగస్టు 5 నుంచి 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ సంఘాలు తెలిపాయి. ‘మా జీవితాలు నాశనం అయ్యాయనే రక్షణ కోరుతున్నాం. రాత్రుళ్లు మేల్కొని కాపలా కాస్తూ కుటుంబాలు, గుళ్లను కాపాడుకుంటున్నాం. కొందరు మిత్రులు ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇలాంటి ఘోర పరిస్థితుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు‘ అని హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అధ్యక్షుడు నిర్మల్ రొసారియో అన్నారు.
బంగ్లాలో మైనారిటీ వర్గాలు తమ హక్కుల సాధనకై ఉద్యమించాయి. మైనారిటీ వర్గాల కోసం దేశంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మైనారిటీ రక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని, దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పార్లమెంటు స్థానాల్లో మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢాకాలోని షాబాగ్ వేదికగా ఉద్యమించాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com