Bangladesh : బంగ్లా సంక్షోభం.. భారత్ ముందు పెనుసవాళ్లు!

బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం భారత్ కు సవాలుగా మారనుంది. విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాత్-ఇ-ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటుచేస్తే భారత్ కు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బీఎస్పీ మొదటి నుంచి భారత వ్యతిరేక స్వరం వినిపిస్తుండగా, జమాత్ ఇస్లామీ పార్టీ పాకిస్థాన్ కు అనుకూల వైఖరి కలిగివుంది. ఈ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే భారత్ కు కొత్త సమస్యలు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్ ను వీడి భారత్ వచ్చిన షేక్ హసీనాకు మోడీ సర్కారు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. ఈ విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై భారత్ డైలమాలో పడింది. ఇక, గత 15 ఏళ్లుగా భారత్ కు అనూకుల ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉండడం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ఢోకా లేకపోయింది. భారత్ వ్యతిరేక అతివాద బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు. దొంగనోట్లు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల రవాణాను రెండు దేశాలు సమర్థంగా అడ్డుకుంటూ వచ్చాయి. బంగ్లాదేశ్ తోపాటు భారత్లోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సజావుగా జరుగుతూ వచ్చింది. 4వేల కిలోమీటర్లకుపైగా ఉన్న సరిహద్దు భద్రత కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి. కొత్త ప్రభుత్వం ఆయా సమస్యల కట్టడికి ఏ మేరకు సహకరిస్తుందనే దానిపై సందిగ్ధం నెలకొంది.
బంగ్లాదేశ్ కేంద్రంగా పాక్, చైనా దేశాలు మనకి వ్యతిరేకంగా అమలుచేసే కుట్రలను అడ్డుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సమస్యగా మారనుంది. ఇప్పటికే అఫ్గానిస్తాన్ నుంచి ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. బంగ్లాదేశ్లో తాజా పరిణామాలతో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, రక్షణ సహకారం విషయంలో భారత్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేలా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనార్టీలపై దాడులు జరిగితే వారు భారత్ కు వలస వచ్చే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు బెంగాలు తరలివచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు వారికి ఆశ్రయం కల్పించడం కూడా సమస్య అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com