Sheikh Hasina : ఉరిశిక్ష పడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆస్తులు లెక్క తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Sheikh Hasina : ఉరిశిక్ష పడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆస్తులు లెక్క తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
X

Sheikh Hasina : బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో నవంబర్ 17, 2025 (సోమవారం) ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఒకప్పుడు దేశంలో తిరుగులేని శక్తిగా, బంగ్లాదేశ్ ఐరన్ లేడీగా పేరొందిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు తన జీవితంలో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ ఢాకా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు ఉరిశిక్ష విధించింది. గత ఏడాది జరిగిన విద్యార్థి ఉద్యమాలు, రాజకీయ సంక్షోభం తర్వాత ఆవామీ లీగ్ ప్రభుత్వం పతనమైంది. ఈ ఉరిశిక్ష తీర్పు ఒకవైపు సంచలనం సృష్టిస్తుంటే, మరోవైపు షేక్ హసీనా సంపద ఎంత అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఉరిశిక్ష వార్తతో పాటు, షేక్ హసీనా ఆర్థిక పరిస్థితి గురించి ప్రజల్లో ఆసక్తి పెరిగింది. బంగ్లాదేశ్‌లో అత్యంత ప్రభావశీలి నాయకురాలిగా ఉన్న హసీనా.. అధికారిక పత్రాల ప్రకారం ప్రకటించిన ఆస్తి వివరాలు చాలా పరిమితంగా ఉన్నాయి. 2022 నాటి ఆదాయం ఆధారంగా ఆమె సమర్పించిన అధికారిక అఫిడవిట్ ప్రకారం, షేక్ హసీనా మొత్తం ఆస్తి సుమారు 4.36 కోట్ల బంగ్లాదేశ్ టాకా. ఆమె సంపాదనకు ప్రధాన మార్గాలు పెద్ద వ్యాపారాలు కావు, కేవలం వ్యవసాయం, చేపల పెంపకం వంటి సంప్రదాయ పనులు మాత్రమేనని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె తన పొదుపును ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్ బాండ్ల వంటి సురక్షిత మార్గాలలో ఉంచడం ద్వారా క్రమం తప్పకుండా వడ్డీ పొందుతున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.

ఆమె ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఉన్న ఆస్తి వివరాలు.. షేక్ హసీనాకు సుమారు 15 బిగాల వ్యవసాయ భూమి ఉంది, దీని అంచనా విలువ 6 లక్షల టాకాలు. 34 లక్షల టాకాలకు పైగా విలువ చేసే ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆమెకు ఒక మూడు అంతస్తుల ఇల్లు ఉంది, దీని విలువ 5 లక్షల టాకాలుగా ప్రకటించారు. ఆమెకు బహుమతిగా వచ్చిన 47 లక్షల టాకాల విలువైన కారు కూడా ఉంది.

నిజమైన సంపద చాలా ఎక్కువా?

అధికారిక పత్రాలు ఆమె సంపద పరిమితమని చెబుతుంటే, మీడియా నివేదికలు, ఆర్థిక విశ్లేషకుల అంచనాలు మాత్రం వేరేగా ఉన్నాయి. షేక్ హసీనా నిజమైన సంపద ఆమె ప్రకటించిన దాని కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. బ్లూమ్‌బర్గ్ వంటి ప్రముఖ పత్రికల నివేదికల ప్రకారం, షేక్ హసీనాకు 3 మిలియన్ డాలర్ల విలువైన ఢాకా భవనం, అలాగే లండన్, సింగపూర్, దుబాయ్‌ వంటి దేశాలలో కూడా ఆస్తులు ఉన్నాయి. అయితే, ఈ ఆస్తులు కొన్ని నేరుగా ఆమె పేరు మీద కాకుండా, ఆమె సోదరి వంటి ఇతరుల పేర్ల మీద రిజిస్టర్ అయి ఉన్నట్లు సమాచారం.

గత సంవత్సరం హసీనా ఇంట్లో పనిచేసిన నోకరు జహంగీర్ ఆలం వద్ద రూ.284 కోట్ల ఆస్తి ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. ప్రస్తుతం ఇతను అమెరికాలో ఉంటున్నాడు. ఈ సంఘటనతో హసీనా రియల్ నెట్ వర్త్ గురించి అనుమానాలు మరింత పెరిగాయి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, భారతీయ కరెన్సీలో ఆమె మొత్తం ఆస్తి రూ.50 కోట్ల వరకు ఉండవచ్చు, అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2025 కోసం ఆమె ఆస్తికి సంబంధించిన కొత్త అధికారిక వివరాలు ఇంకా విడుదల కాలేదు.

Tags

Next Story