BF-7 Corona Variant: చైనీస్‌కు ఇమ్యూనిటీ తక్కువ.. భారత్‌కు ఆ భయం లేదు.. అలాగని..

BF-7 New Variant: కరోనా వైరస్ కమ్మేస్తోంది. చైనాను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి ఇండియాలోనూ కనిపించింది. గుజరాత్‌లో ఇద్దరికి, ఒడిశాలో ఒకరికి కొత్త వేరియంట్ వైరస్ సోకింది. ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్‌గా పుట్టుకొచ్చిన బీఎఫ్-7.. చైనా సహా పలు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
ప్రస్తుతం చైనాలో అత్యధిక మరణాలకు ఈ కొత్త వేరియంటే కారణం అవుతోంది. ఆ బీఎఫ్-7 వేరియంట్ ఇప్పుడు భారత్‌లో కూడా కనిపించింది. ఇప్పటి వరకు భారత్‌లో బయటపడిన బీఎఫ్-7 కేసులు మూడు మాత్రమే. నిజానికి ఈ కొత్త సబ్ వేరియంట్‌ను బయోటెక్నాలజీ రీసెర్చ్ అక్టోబర్‌లోనే కనిపెట్టింది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. బీఎఫ్-7 సునామీలా విరుచుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీఎఫ్-7 ప్రమాదకరమైన వేరియంట్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒమిక్రాన్‌లానే ఇది కూడా వేగంగా వ్యాపిస్తుంది. ఒకరికి బీఎఫ్-7 వేరియంట్ సోకితే.. అది 19 మందికి పాకుతుందని చెబుతున్నారు. ఈ వేరియంట్ సోకితే.. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు గరగర, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అతి కొద్ది కేసుల్లో మాత్రం వాంతులు, డయేరియా వంటి పొట్ట సంబంధ వ్యాధులు బయటపడవచ్చన్నారు.
అయితే, భారత్‌లో మాత్రం ఈ వేరియంట్‌పై ఆందోళన అక్కర్లేదనే భరోసా ఇస్తున్నారు. చైనీస్‌కు ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్లే ఇది ప్రమాదకారిగా ఉందని, భారతీయుల విషయంలో ఏమంత ప్రమాదకారి కాదని చెబుతున్నారు. నిజానికి గత అక్టోబర్‌లోనే మనదేశంలో బీఎఫ్-7 కనిపించినా.. దాని వ్యాప్తి మాత్రం అంత వేగంగా లేదు. దీనికి కారణం భారతీయుల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉండడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేదు. బుధవారం ఉదయం వరకు ఇండియాలో 129 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అలాగని, అప్రమత్తంగా, జాగ్రత్తగా లేకపోతే మాత్రం మహమ్మారి విజృంభణ తప్పదని హెచ్చరిస్తున్నారు.
బీఎఫ్-7 విజృంభణను చైనా కట్టడి చేయలేకపోతోంది. చైనా ఆసుపత్రుల్లో కరోనా మరణాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోయాయి. మృతులతో శవాగారాలు, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చైనాలో హైడ్రోజన్ బాంబులా కరోనా విస్ఫోటనం సంభవించింది. వచ్చే 90 రోజుల్లో 60 శాతం చైనా జనాభాకు, 10 శాతం ప్రపంచ జనాభాకు కరోనా సోకుతుందని అమెరికన్ అంటువ్యాధి నిపుణుడు ఎరిక్ హెచ్చరించారు. మరణాల సంఖ్య లక్షల్లో ఉంటుందని తెలిపారు.
ఒకప్పుడు చైనాలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి కొన్ని రోజులు పడితే, ఇప్పుడది గంటల్లోనే జరుగుతోందని గుర్తు చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కో దహనవాటికలో రోజుకు 200 మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. బీజింగ్‌లోని ఓ శ్మశానంలో అయితే 24 గంటలూ అంత్యక్రియలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో శ్మశాన వాటిక సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. అటు చైనా సహా జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 10కోట్లు దాటింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై దృష్టిపెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com