Congo: పడవకు నిప్పంటుకుని 143 మంది మృతి

మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చమురును తీసుకుని వస్తున్న భారీ పడవలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని బోల్తా పడటంతో 143 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఆ దేశ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 15న వందలాది మంది ప్రయాణికులతో పాటు చమురును తీసుకుని వస్తున్న భారీ చెక్క పడవకు కాంగో నదిలో ఈక్వాటార్ ప్రావిన్స్ రాజధాని మబండాకాకు సమీపంలో హఠాత్తుగా నిప్పంటుకుంది. అనంతరం పేలుడు సంభవించడంతో చాలా మంది సజీవ దహనమయ్యారు.
కొంతమంది ప్రాణ భయంతో నీటిలోకి దూకేశారు. ఇంతవరకు 143 మృతదేహాలను వెలికి తీశామని, చాలా మంది మృతదేహాలు బొగ్గులా మారాయని అధికారులు తెలిపారు. పడవలో వంట కోసం నిప్పంటించేటప్పుడు జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ దేశంలో కొన్ని నగరాలు, పట్టణాలకు తప్ప మిగిలిన చోట్లకు రోడ్డు, విమాన సౌకర్యాలు అంతగా లేవు. దాంతో చాలా మంది నదుల మీదుగా పయనిస్తుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com